‘భగీరథ’లో సీఎంకు 6% వాటా

27 Nov, 2018 06:11 IST|Sakshi
మీట్‌ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో ఐజేయూ మాజీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి

ఆ డబ్బుతోనే ఎన్నికల ప్రచారం

టీయూడబ్ల్యూజే మీట్‌ ది ప్రెస్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కమిషన్‌ భగీరథలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాటా ఆరు శాతం. ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఆరు శాతం కమిషన్‌ తీసుకుని ఆయన కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలున్నాయి. రాష్ట్రంలో సగటున కోటి ఇళ్లు ఉంటే నాలుగున్నరేళ్లలో కనీసం లక్ష ఇళ్లకు కూడా భగీరథ నీళ్లు ఇవ్వలేదు. కమిషన్‌ డబ్బుతోనే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

సోమవారం హైదరాబాద్‌లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ చలవే. ఆమె లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదని కేసీఆర్‌ బహిరంగం గానే చెప్పారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిం ది 33 శాతం ఓట్లే. కేసీఆర్‌ను 65 శాతం మంది ఓటర్లు తిరస్కరించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. దళితుడిని సీఎం చేస్తామన్న మొదటి హామీతోనే ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టారు. ప్రజా స్వామ్యంలో క్రియాశీలకంగా వ్యవహరించే జర్నలిస్టులు సహా అన్ని వర్గాలను మోసగించి రాజకీయ విలువలకు పాతరేశారు.

కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోను కాపీ కొట్టి చవకబారుతనాన్ని చాటుకున్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడిగా కేసీఆర్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు’ అని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఓటేస్తే ప్రజల ఉనికికే ప్రమాదమని, ఆ పార్టీకి మళ్లీ ఓటేస్తే రాష్ట్రంలో బతకడమే కష్టమవుతుందన్నారు. మళ్లీ అధికారం తమదేనని చెప్పుకున్న కేసీఆర్‌కు మహాకూటమి అంటే వణుకు పుడుతోందన్నారు. కేసీఆర్‌ తాగి సోయి లేకుండా సోని యాపై విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ దొంగ పాస్‌పోర్టులు అమ్ముకునే సమయంలో తాను సైన్యం లో దేశ సరిహద్దులో భద్రతా దళంలో ఉన్నానని, ఆయన బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.

ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకున్నాఎంఐఎం మద్దతివ్వడమా?
తమిళనాడు తరహాలో రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్లు కల్పిస్తాన ని చెప్పిన కేసీఆర్‌... వాటిని అమలు చేయకుండా ఆయా వర్గాలను మోసం చేశారని ఉత్తమ్‌ ఆరోపిం చారు. ఎంఐఎం అహంకారంతో మాట్లాడుతోందని, టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తోందో ఆ పార్టీ స్పష్టం చేయాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వనందుకు టీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ మద్దతు పలుకుతోందా? అని ప్రశ్నించారు.

సూట్‌కేసులు తప్ప ఏమీ గుర్తుకు రావు
తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడుతాయని సోనియా భావించారని, కానీ వారిని కేసీఆర్‌ పాతాళంలోకి నెట్టేసినందుకే ఆమె కడుపు తరుక్కుపోయిందని, ఆమెను విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. ప్రతి దాంట్లో కమిషన్‌ తీసుకునే కేసీఆర్‌కు సూట్‌కేసులు తప్ప మరే విషయాలు గుర్తుకు రావన్నారు. ఓటమి భయంతో సోయి తప్పి ఆయన మాట్లాడుతున్నారన్నారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్‌లాగా తాను బ్రోకర్‌లా బతకలేదని, దేశ భద్రతా దళంలో ప్రాణాలకు తెగించి యుద్ధ విమానాలు నడిపానన్నారు.

విభజన హామీలపై గళమెత్తరేం?
టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క విద్యుత్‌ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఒక్క యూనిట్‌ విద్యుదుత్పత్తి చేయలేదని, గత కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ఫలితంగానే రాష్ట్రంలో కరెంటు వస్తోందన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే చోట ముందుగా పనులు చేపట్టి భారీగా నిధులు ధుర్వినియోగం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిజం స్పాట్‌లా మార్చారని, సాగునీళ్లు ఇవ్వకుండా వచ్చిన వాళ్లందరినీ అక్కడికి తీసుకెళ్లి ఆహా, ఓహో అనిపిస్తున్నారన్నారు. విభజన హామీలపై గళమెత్తే సాహసం కేసీఆర్‌ చేయరని, మోదీ పేరు చెబితేనే కేసీఆర్‌ లాగు తడుస్తుందన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్‌ అమలును కేసీఆర్‌ అటకెక్కించారన్నారు.

గెలిచినా ఓడినా నాదే బాధ్యత
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ను కొందరు మీడియా ప్రతినిధులు పలకరించారు. డిసెంబర్‌ 11 తర్వాత అన్ని వ్యవహారాలు సచివాలయం నుంచే నిర్వహిస్తారా అని అడిగారు. ఉత్తమ్‌ స్పందిస్తూ... ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచినా, ఓడినా నాదే బాధ్యత. డిసెంబర్‌ 11 తర్వాత గాంధీభవన్‌కు రాను’అని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌ వ్యాఖ్యలతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే ఉత్తమ్‌ సచివాలయానికే వెళ్తారు కదా! అని వారు అనుకున్నారు.

జర్నలిస్టుల ఇళ్లపై కోర్టు కేసుల్లేవు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని, డబుల్, ట్రిబుల్‌ బెడ్రూంల ఇళ్లు కట్టిస్తానని చెప్పి కేసీఆర్‌ మాత్రం ప్రగతి భవన్‌ కట్టుకున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఎలాంటి కేసుల్లేవని, ఒక సొసైటీకి సంబంధించిన కేసు మాత్రమే సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. అందులో అన్ని వర్గాలు ఉన్నాయని, అది జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించిన కేసు కాదన్నారు. డిసెంబర్‌ 12న ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వంలో మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జర్నలిస్టులకు 18 వేల ఇళ్లు, స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల కుటుంబాలకు విద్య, వైద్య పథకా లు అమలు చేస్తామన్నారు. తన భార్య పద్మావతి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడంతోనే అధిష్టానం టికెట్‌ ఇచ్చిందన్నారు. తమకు పిల్లలు లేరని, రాష్ట్ర ప్రజలే తన కుటుంబమన్నారు. తమ జీవితం ప్రజాసేవకే అంకితం చేశామన్నారు.

మరిన్ని వార్తలు