మమ్మల్ని గెలిపిస్తే.. ఓ ప్రాజెక్టుకు జాతీయహోదా

21 Mar, 2019 01:08 IST|Sakshi

విభజన చట్టంలోనిహామీలన్నీ సాధిస్తాం.. ఆశీర్వదించండి!

ఐదేళ్లలో కేసీఆర్‌ చేసింది శూన్యం

పార్టీ మారుతున్నది అవకాశవాదులే.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ విమర్శ

కేసీఆర్‌ చర్యలతో తెలంగాణ సిగ్గుపడుతోంది: రాజగోపాల్‌ రెడ్డి

టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు గెలిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్‌

సీఎం నైతిక విలువలను మంటకలిపారన్న జానారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 16మంది ఎంపీలు చేతిలో ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి సాధించింది శూన్యమని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత గులాబీ పార్టీకి లేదన్నారు. బుధవారం గాంధీభవన్‌లో నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా బీజేపీకి అనధికార మిత్రపక్షంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఎన్నికలొచ్చాయని బీజేపీపై తూతూమంత్రంగా విమర్శలు చేస్తోందన్నారు. ఆరెస్సెస్‌ నేపథ్యమున్న రామ్‌నాథ్‌కోవింద్‌ను రాష్ట్రపతి చేయడంలో, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో, జీఎస్టీ, నోట్లరద్దు, అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి టీఆర్‌ఎస్‌ అండగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇంత చేసినా కేంద్రం నుంచి ఏమీ సాధించలేకపోయారన్నారు. కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. అన్ని విధాలుగా విఫలం చెందిన టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే

మోరీలో వేసినట్టేనన్నారు. తమపై విశ్వాసం ఉంచి ఆశీర్వదించి మెజార్టీ స్థానాలు కట్టబెడితే విభజన చట్టంలోని హామీలను సాధించుకొస్తామన్నారు. ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించడంతో పాటు ఖాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ పునరుద్ధరణ, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి హామీలు నెరవేరుస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టించి వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించేందుకు కృషి చేస్తామని ఉత్తమ్‌ చెప్పారు. నల్లగొండ, భువనగిరి స్థానాల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని, రాష్ట్రంలోని మెజార్టీ స్థానాల్లోనూ గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
సమాజం ఛీత్కరించుకుంటోంది
తమ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు, మంత్రులు, ఇతర పదవులు అనుభవించిన వారు ఇప్పుడు అవకాశవాదంతో పార్టీలు మారుతున్నారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. కుంటిసాకులు చూని.. తమ రక్తం, చెమటలను ధారపోసి గెలిపించిన కార్యకర్తల ఆశలు వమ్ముచేస్తున్నారన్నారు. వారు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని, పార్టీ మారిన వారిని చూసి తెలంగాణ సమాజం ఛీ కొడుతోందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులిచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ‘పార్టీ మారినవారంతా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళుతున్నామని చెబుతున్నారు. అంటే కేసీఆర్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అభివృద్ధి చేయరా?’అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. అలాంటప్పుడు అసెంబ్లీ, కౌన్సిల్‌ను తెలంగాణ భవన్‌కు, ప్రగతిభవన్‌కు మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అవసరమైతే రాజీనామా చేస్తామని తమ లేఖల్లో చెపుతున్నారని, అవసరమైతే కాదని, ఖచ్చితంగా చేయించి ప్రజాతీర్పు కోరాలని ఉత్తమ్‌ సవాల్‌ చేశారు.
 
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు: జానా
రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, నైతిక విలువలను మంటకలిపారని మాజీ మంత్రి కె.జానారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యమేనా అని ఆయన ప్రశ్నించారు. తాను ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తే.. ఓటరు దేవుడు ప్రభుత్వమే లేకుండా చేయగల అధికారం ఉన్నవాడని, ఒకసారి అలాంటిది రుజువు చేస్తేనే ఫిరాయింపులకు ఫుల్‌స్టాప్‌ పడుతుందన్నారు. అధికార అహానికి కూడా తెరపడుతుందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ వర్సెస్‌ కేసీఆర్‌ కానేకాదన్నారు. ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు పట్టుకునే కేసీఆర్‌.. డ్రామాకంపెనీ తరహాలో ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతున్నారని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు.
 
నా సవాల్‌కు సిద్ధమేనా?
కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక అనైతికంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. 16 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, వారు 16 స్థానాలు గెలిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు. ‘కేసీఆర్, కేటీఆర్‌లు ఇందుకు సిద్ధమా?’అని సవాల్‌ విసిరారు ‘అభ్యర్థుల ముఖం చూడాల్సిన పనిలేదని.. తన ముఖం చూసి ఓట్లేయాలని కేసీఆర్‌ అంటున్నారు. అంటే ఆయన పెడుతున్న అభ్యర్థులు డమ్మీలని ఒప్పుకున్నట్లేనా? అలాంటప్పుడు అభ్యర్థులు, ఎన్నికలు ఎందుకు? అన్ని శాఖలు తన వద్దే ఉంచుకుని ఫాంహౌజ్‌ నుంచి పాలిస్తే సరిపోతుందిగా’అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ చర్యలు.. తెలంగాణ సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్‌రెడ్డి రంగారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సమరసింహారెడ్డి, కుంభం అనిల్‌కుమార్, అద్దంకి దయాకర్, బూడిద భిక్షమయ్యగౌడ్, బాలూ నాయక్, పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు