సీపీ అంజనీ కుమార్‌పై విరుచుకుపడ్డ ఉత్తమ్‌

28 Dec, 2019 16:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంజనీ కుమార్‌ టీఆర్‌ఎస్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో సత్యాగ్రహ దీక్ష చేస్తే వేల మంది పోలీసులతో కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. సీపీ అంజనీ కుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంజనీ కుమార్‌ ఎప్పుడు.. ఎక్కడ ఏం చేశాడో తెలుసని.. ఆ చిట్టా అంతా గవర్నర్‌ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. తమను ఇబ్బంది పెట్టే విధంగా అహంకారం, పొగరుబోతు తనంతో అజనీ కుమార్‌ వ్యవహరించారని విమర్శించారు. అంజనీ కుమార్‌ ఐపీఎస్‌ తీసేసి కేపీఎస్‌ అని పెట్టుకోవాలని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. 

అదే విధంగా.. ‘‘ట్రాఫిక్‌ ఇబ్బంది అవుతుందని పర్మిషన్‌ ఇవ్వడం లేదని సీపీ అంటున్నారు. ట్రాఫిక్‌ సమస్య లేకుండా మేము వెళ్తామని చెప్పినా అనుమతి ఇవ్వలేదు. ఎక్కడి నుంచో వచ్చావ్‌.. ఉద్యోగం చేసుకొని వెళ్లిపో.. నీ అంతు చూస్తాం. కొద్ది సేపటి క్రితమే గవర్నర్‌తో మాట్లాడా.. సెక్షన్‌ 8 ప్రకారం అంజనీ కుమార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం. పార్లమెంటులో అన్ని బిల్లులకు బీజేపీకి ఓటు వేసిన కేసీఆర్‌ ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఏ నిరుద్యోగికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా... ఒక్క రైతుకు అయినా రుణమాఫీ చేసారా.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు సరైన బుద్ది చెప్పాలి. మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించాలి. కాంగ్రెస్‌ ఎన్నికలకు భయపడుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు చిల్లరగా మాట్లాడుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్‌ డాటా అంతా టీఆర్‌ఎస్‌కు ముందే చేరింది’’ అని టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో ఉత్తమ్‌ కుమార్‌ విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు