కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన ఉత్తమ్‌

25 Jun, 2018 11:34 IST|Sakshi
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కేసీఆర్‌ (పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విసిరిన సవాల్‌ను కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్వీకరించారు. రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎన్నికల విషయంలో తమ వైఖరిని ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. అవినీతిమయమైన టీఆర్‌ఎస్‌ పాలనకు స్వస్తి పలికేందుకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధమేనన్నారు. ముందస్తు ఎన్నికలు అనేవి తెలంగాణ ప్రజలకు నిజంగానే శుభవార్త అని, కేసీఆర్‌ పాలన నుంచి కొన్ని నెలల ముందుగానే రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ‘వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టీఆర్‌ఎస్‌ను ఏమీ చేయలేవు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు ఆపకపోతే ఎన్నికలకు పోదాం పదా అని అడుగుతా.. ఇలా అడిగే రోజు దగ్గర్లోనే ఉందని’ సీఎం కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు తెలివి తక్కువ దద్దమ్మలని, వారికి అబద్ధం కూడా అతికేటట్టు మాట్లాడే తెలివి లేదని మండిపడ్డారు. ఆదివారం(జూన్‌ 24న) మాజీ మంత్రి దానం నాగేందర్‌ తెలంగాణ భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించిన కేసీఆర్‌.. దానం టీఆర్‌ఎస్‌ చేరిక సమయంలోనూ డిసెంబర్‌లో ఎన్నికలకు ఇతర పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మరో 15 మంది దాకా చేరుతామంటున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ స్పందిస్తూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే కాంగ్రెస్‌ లక్ష్యమని పేర్కొన్నారు.
సంబంధిత కథనం
(ఎన్నికలకు వెళ్దామా?)

మరిన్ని వార్తలు