అధికారమిస్తే మెగా డీఎస్సీ

4 Sep, 2018 01:55 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ హామీ

ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ

‘స్వయం ఉపాధి’తో మరో లక్ష ఉద్యోగాలు..

ఉన్న ఖాళీలు నింపలేని అసమర్థుడు కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా మరో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర సాధన ఉద్యమంలో యువత కీలకంగా పాల్గొని ప్రాణ త్యాగాలు చేస్తే వారి ఆశలను సీఎం కేసీఆర్‌ నీరుగార్చారని విమర్శించారు. తన ఇంట్లో ఉద్యోగాలు నింపుకునే పనిలో మునిగిపోయిన కేసీఆర్‌.. రాష్ట్రంలోని నిరుద్యోగుల గురించి మర్చిపోయారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు సీఎం ద్రోహం చేశారని, కేసీఆర్‌పై యువత రగిలిపోతోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పారు. జోనల్‌ వ్యవస్థపై కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని, ఇందులో ఆయన కొత్తగా సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్‌ అని విమర్శించారు. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పనలో సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు.  

ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేదు 
తెలంగాణ వస్తే ఒక్క దెబ్బతో లక్ష ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్‌ చెప్పారని.. కానీ రాష్ట్రంలో రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలుంటే 11 వేలే భర్తీ చేశారని ఉత్తమ్‌ విమర్శించారు. ఒక్క టీచర్‌ పోస్టు భర్తీ చేయలేదని.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులూ నింపలేదన్నారు. ఐటీఐఆర్‌ ద్వారా 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అసెంబ్లీలో చెప్పి దాన్ని ప్రధాని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కేసీఆర్‌కు అధికారం నుంచి దిగిపోయే ముందు నిరుద్యోగ భృతి గుర్తుకొచ్చిందా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. తాము నిరుద్యోగ భృతి ఇస్తామంటే అవహేళన చేసి.. ఇప్పుడు తానిస్తానని ఎలా చెపుతున్నారని నిలదీశారు. తనపై విమర్శలు చేసే నైతికత దానం నాగేందర్‌కు లేదని, పిచ్చోడి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, దాసోజు శ్రావణ్, ఓయూ విద్యార్థి నేతలు మానవతారాయ్, విజయ్, చెనగోని దయాకర్, బాలలక్ష్మి, దరువు ఎల్లయ్య, చరణ్‌కౌశిక్, దుర్గం భాస్కర్, కేతూరి వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు