మమ్మల్ని కొట్టారు.. తొక్కారు.. గిచ్చారు..

13 Mar, 2018 02:00 IST|Sakshi

12 మంది సభ్యులం ఉంటే 50 మంది మార్షల్స్‌ వచ్చారు: ఉత్తమ్‌

కనీసం పోడియంలోకి వెళ్లనీయకుండా గొంతు నొక్కారు

సీఎం, హరీశ్‌ నియంతృత్వం వల్లే ఆ ఘటన: కోమటిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగం సంద ర్భంగా అసెంబ్లీలో తమ సభ్యులను మార్షల్స్‌ వేధించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్‌ ఖూనీ చేశారని విమర్శించారు. నేతలు షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్ర మార్క, సంపత్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరు ణ, పద్మావతి, రామ్మోహన్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.

అసెంబ్లీలో జరిగిన ఘటన ప్రతిపక్షాలను అణచివేసేలా ఉందన్నారు. తాము 12 మంది ఉంటే 50 మంది మార్షల్స్‌ వచ్చారని, పోడియం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. పార్ల మెంట్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారని, అసెంబ్లీలో మాత్రం ప్రతిపక్షాల ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తమను కొట్టారని, తొక్కారని, గిచ్చారని, తమ గొంతు లేకుండా చేసే యత్న మని అన్నారు. కిందపడేసి, కొట్టి, తొక్కి తమ హక్కులను కాలరాశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎంత చప్పగా ఉందో గవర్నర్‌ ప్రసంగం కూడా అంతే చప్పగా ఉందని చిన్నారెడ్డి అన్నారు.

కేసీఆర్‌ నన్ను బలివ్వాలని చూస్తున్నారు: కోమటిరెడ్డి
ఈ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చినందునే నియంతలా వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత అధికార పక్షానిదేనని అన్నారు. తన 20 ఏళ్ల ఎమ్మెల్యే చరిత్రలో పోడియం దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవడం ఇదే తొలిసారి అని అన్నారు. గతంలో గవర్నర్‌ గల్లాలు పట్టుకున్న వాళ్లు తమకు చెప్పాల్సిందేమీ లేదంటూ ఎద్దేవా చేశారు. తన కాలికి కూడా గాయమైందని చెప్పిన కోమటిరెడ్డి ఆ గాయాలను మీడియాకు చూపించారు.

తర్వా త కోమటిరెడ్డి మీడియాతో విడిగా, ఆ తర్వాత చౌటుప్పల్‌లోనూ విలేకరులతో మాట్లాడారు. తనను సీఎం కేసీఆర్‌ బలి ఇవ్వాలని చూస్తున్నారని, అందరికీ తానే టార్గెట్‌ అయ్యానని పేర్కొన్నారు. ప్రజల కోసం తాను ఏం కావడానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నల్ల గొండ పార్లమెంట్‌కు పోటీచేస్తే తాను ఇంట్లో కూర్చున్నా ఆయనపై గెలుస్తానని పేర్కొన్నారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేయాలని పార్టీ ఆదేశించినా సిద్ధమేనన్నారు. అసెంబ్లీలో ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. ‘ఉద్యమకారుడిగా స్వామిగౌడ్‌ అంటే గౌరవం ఉంది. ప్రభుత్వమే అనవసర రాద్ధాం తం చేస్తోంది. సీఎం, హరీశ్‌ల నియంతృత్వం కారణంగానే ఆ ఘటన జరిగింది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు