బంగారు తెలంగాణ కాదు.. బంగారు కుటుంబం

26 Feb, 2018 02:35 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విసుర్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తానన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఆదివారం ఇక్కడి ఇందిరాభవన్‌లో జరిగిన ఎన్‌ఎస్‌ఐయూ, యూత్‌ కాంగ్రెస్‌ పూర్వ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.

దళితులకు మూడెకరాల పంపిణీ, రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ సబ్సిడీ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు తదితర పథకాల అమల్లో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేయాలని ఉత్తమ్‌ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనిపిస్తోందని, యువ కార్యకర్తలు పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, పంటల బీమా చెల్లిస్తామని, 17 వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని, ఈ విషయాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్‌ వ్యాఖ్యలపై కొందరు యూత్‌ కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు.

మరిన్ని వార్తలు