ఎన్నికల కోసమే కేసీఆర్‌ రైతు జపం

28 Feb, 2018 01:46 IST|Sakshi

తాండూరు సభలో కాంగ్రెస్‌ ధ్వజం

నాలుగేళ్లలో రైతులు గర్తు రాలేదేం?

ఈ డిసెంబర్లోనే ఎన్నికలు.. వచ్చేది మేమే

అన్ని పంటలకూ మద్దతు ధర: ఉత్తమ్‌

రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్‌ పాత్ర తక్కువే: జైపాల్‌

సాక్షి, వికారాబాద్‌ :  ఎన్నికలు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు జపం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా లేనిది, కాంగ్రెస్‌ బస్సు యాత్ర చేపట్టగానే ప్రభుత్వానికి వణుకు మొదలై రైతు బాట పట్టారని విమర్శించారు. రైతులపై కపట ప్రేమ చూపుతున్న కేసీఆర్‌ను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించడానికి సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర రెండో రోజు మంగళవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలంతా టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు.

గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతుంటే సమన్వయ సమితుల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘‘రైతు రుణమాఫీకంటూ ఐదు విడతలుగా విడుదల చేసిన సొమ్ము వడ్డీకే సరిపోయింది. నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్‌ కుటుంబీకులకు 6 శాతం కమిషన్‌ కోసమే మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ తెచ్చారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన తరుణం వచ్చింది. ఈ డిసెంబరులోనే ఎన్నికలొస్తాయని నాకు సమాచారముంది.

మేం అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం. 17 ప్రధాన పంటలకు మద్ధతు ధర ఇస్తాం. గిట్టుబాటు ధరలనూ భారీగా పెంచుతాం. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి ఎ గ్రూపులో కలపడానికి కమిటీ వేస్తాం. ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఆర్నెల్లలోగా భర్తీ చేస్తాం. రానివారికి రూ.3,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. 6 లక్షల డ్వాక్రా సంఘాల్లోని 70 లక్షల మంది మహిళలకు రూ.లక్ష చొప్పున రివాల్వింగ్‌ ఫండ్‌ చెల్లిస్తాం. రూ.10 లక్షల దాకా ఇచ్చే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది’’అని పునరుద్ఘాటించారు.

అసాధ్య హామీలు: కుంతియా
అసాధ్యమైన హామీలతో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఆరోపించారు. ఏ వర్గానికీ న్యాయం చేయలేని కేసీఆర్‌ ప్రభుత్వం అంతిమ ఘడియల్లో ఉందన్నారు. నీరవ్‌ మోదీ, నరేంద్ర మోదీ బ్యాంకులను దోచుకున్నట్టు కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ బస్సు యాత్రతో కేసీఆర్‌కు గుబులు పుట్టిందని పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ భట్టి విక్రమార్క అన్నారు.


టీఆర్‌ఎస్‌కు నైతిక హక్కులేదు: కె.జానారెడ్డి
కాంగ్రెస్‌ పాలనలో ఏం చేశారని అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. నిజాం షుగర్స్, సిరిసిల్ల ఫ్యాక్టరీలను ఇప్పటివరకు ఎందుకు తెరిపించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ వచ్చింది తప్ప రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్‌ పాత్ర చాలా తక్కువని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు నిరాహార దీక్ష సమయంలో 750 కేలరీల పోషక విలువలున్న ఇంజక్షన్లు ఇచ్చారని అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌ లోఫర్‌ పార్టీ అంటున్న మంత్రి కేటీఆర్‌ ఖబడ్దార్‌ అని మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్‌లే లోఫర్లని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు