కేసీఆర్‌ది మైండ్‌ గేమ్‌

6 Mar, 2018 02:01 IST|Sakshi

ప్రజల దృష్టి మరల్చేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌: ఉత్తమ్‌

సీఎం బూటకపు మాటలకు అంత కవరేజా?

మేమూ ఓ చానల్, పేపరు పెడతామని ప్రకటన

ఎన్నికల నాటికి 100 సీట్లు గెల్చుకుంటామని ధీమా  

నిజామాబాద్‌ జిల్లాలో ముగిసిన బస్సు యాత్ర

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ప్రజా వ్యతిరేకత, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. ప్రజాచైతన్య బస్సుయాత్ర రెండోరోజూ సోమవారం నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగింది. ఆర్మూర్‌ నియోజకవర్గం నందిపేట్, బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌లో బహిరంగ సభలలోను, అంతకు ముందు నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు.

తెలంగాణలో ఏం సాధించని కేసీఆర్‌.. కేంద్రానికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. సీఎం ప్రకటిస్తున్న సర్వేలన్నీ బోగస్‌ అని అన్నారు.. ప్రస్తుత సర్వే ప్రకారం తమ పార్టీ 70 సీట్లు సాధిస్తుందని, ఎన్నికల నాటికి వంద సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఓటు కూడా లేని పవన్‌కల్యాణ్, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన అసదుద్దీన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  

పంట రుణ పరిమితి పెంచండి
సాగు వ్యయానికి సరిపడా పంట రుణ పరిమితిని పెంచాలని డిమాండ్‌ చేస్తూ రైతులతో సంతకాల సేకరణ, కలెక్టరేట్‌లో వినతిపత్రాలు అందజేస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. అభయహస్తం పింఛను, మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు నాలుగేళ్లలో రూ.ఐదు లక్షల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం ఐదు రూపాయలు కూడా కేటాయించలేదని విమర్శించారు. గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి, జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుపై చర్చ జరగాలన్నారు.  

కుటుంబంలో అందరికీ పింఛన్లు
తాము అధికారంలోకి వచ్చాక కుటుంబంలోని అర్హులైన వారందరికీ పింఛన్‌ మంజూరు చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని, ఈ గృహాలకు అదనపు గదులు నిర్మించి ఇస్తామని చెప్పారు. రూ.రెండు లక్షల పంట రుణమాఫీ, రైతుల ఉత్పత్తులకు మద్దతు ధరల పెంపు వంటి హామీలను పునరుద్ఘాటించారు.  

ఓ పేపర్, చానల్‌ పెడతాం
ఓ పేపర్, ఓ చానల్‌ను ప్రారంభిస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. తమ ప్రచారానికి సోషల్‌ మీడియాను కూడా వినియోగించు కుంటామని తెలిపారు. ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ మాట్లాడిన బూటకపు మాటలకు కవ రేజీ ఇస్తున్నారని, తమకు కూడా ఆ స్థాయి కవరేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఎం సచివాలయానికి వెళ్లకుంటే వార్తలు రాయడానికి దమ్ములేదని విమర్శించారు. ఈ సందర్భం గా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల ప్రధాన సంచికలను వేదికపై ప్రదర్శించారు.

దళితుణ్ణి సీఎంను చేసి ఢిల్లీకి వెళ్లు: వీహెచ్‌
ముఖ్యమంత్రి పదవిని కె.చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీఆర్‌కు కాకుండా, ఓ దళితుడికి ఇచ్చి ఢిల్లీకి వెళ్లాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు పేర్కొన్నారు. పరిమితం(లిమిట్‌)గా సంపాదించామని ప్రకటించిన కేసీఆర్‌ ఆ పరిమితం ఎంతో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.

జైలులో పెడతారనే ఆలోచన ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చిందని, నీళ్లు రాక ముందే కట్ట కట్టే విధంగా కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. వాటర్‌గ్రిడ్, కాళేశ్వరం వంటి వాటిలో కేంద్రం విచారణ చేపడుతోందనే విషయం అందరికీ తెలుసన్నారు. మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించారు.

>
మరిన్ని వార్తలు