టీఆర్‌ఎస్‌పై ప్రతీకారం తీర్చుకోండి

25 Sep, 2018 01:29 IST|Sakshi

రాష్ట్రంలోని మాదిగ, మాల కులస్తులకు ఉత్తమ్‌ పిలుపు

మాదిగ, మాలల్లో ఒక్కరూ కేబినెట్‌లో పనికిరారా?

సిరిసిల్ల ఘటనను మాదిగలు మరవద్దు

టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలె.. గోరీ కట్టాలె

ఇప్పుడు నిశబ్దంగా ఉంటే చరిత్ర క్షమించదు

ఈసారి కేసీఆర్‌ను వదిలిపెడితే ఎవరినీ బతకనీయడు

చేవెళ్ల దళిత నేత భీమ్‌ భారత్‌.. కాంగ్రెస్‌లో చేరిక సభలో వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో అణగారిన వర్గాలను, ముఖ్యంగా దళితులను అణచివేతకు గురిచేసి, మోసం చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్రంలోని మాదిగ, మాల కులాలకు చెందిన ప్రజలు ప్రతీకారం తీర్చుకోవాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. నలుగురున్న కేసీఆర్‌ కుటుంబానికి, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో మాల, మాదిగలు ముందుండి కేసీఆర్‌పై పోరాడాలని కోరారు.

సోమవారం గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన దళిత, ప్రజాసంఘాల నాయకుడు భీం భారత్‌ పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రకాశం హాల్‌లో జరిగిన సభలో ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లవుతుందని, అంతకు ముందు కూడా ఢిల్లీలోని పెద్దలతో తనకు సాన్నిహిత్యం ఉందని, కానీ తన రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూస్తానని అనుకోలేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని అతిపెద్ద సామాజిక వర్గమైన దళిత జాతిని కేసీఆర్‌ అనేక ఇబ్బందులకు గురిచేసి అవమానపర్చాడని ఆరోపించారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన సిరిసిల్ల దళితులకు కరెంటుషాక్‌లు పెట్టి హింసించారని, ఇదేమని ప్రశ్నించిన దళిత మహిళలను బ్రోతల్‌ కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని చెప్పారు. రాష్ట్రంలో మాదిగ, మాల కులస్తులు 80 లక్షల మంది ఉంటే అందులో ఒక్కరు కూడా మంత్రిగా పనిచేసేందుకు పనికిరారా అని ప్రశ్నించారు.

లక్ష గజాల్లో ప్రజల సొమ్ముతో ఇల్లు..
మాదిగ, మాల కులాలకు చెందిన ఒక్కరు కూడా కేబినెట్‌లో లేరని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి, కనీసం ఒక్క మాదిగ, మాల కులస్తుడికి కేబినెట్‌లో కూడా అవకాశం ఇవ్వని నియంత కేసీఆర్‌ అని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టుకునేందుకు 200 గజాల స్థలం ఇవ్వలేని కేసీఆర్, తాను మాత్రం లక్ష గజాల్లో ప్రగతి భవన్‌ కట్టుకుని విలాస జీవితం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.

లక్ష గజాల్లో ప్రజల సొమ్ముతో ఇల్లు కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, దీనిపై తాను ప్రశ్నిస్తే ప్రగతిభవన్‌లో 150 గదులున్నాయని ఉత్తమ్‌ చూపిస్తాడా అంటూ కేసీఆర్‌ బట్టెబాజ్‌ మాటలు మాట్లాడాడని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్‌ ఇసుకను అమ్ముకుని కోట్ల రూపాయలు గడించారని, రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం ఇసుక మాఫియా నడిపిస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. ఇసుక మాఫియా ఆకృత్యాలకు నిదర్శనంగా నిలిచిన సిరిసిల్ల ఘటనను మాదిగలు మర్చిపోవద్దని, దళిత యువకులకు కరెంటుషాక్‌లు పెట్టిన కేసీఆర్‌కు ఈసారి ఓటుతో షాక్‌ ఇవ్వాలని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలను మోసం చేసే కుట్ర
అణగారిన వర్గాలను అణచివేస్తున్న కేసీఆర్‌ ఆగడాలను నిలువరించే చారిత్రక సందర్భం ఆసన్నమైందని, తెలంగాణలోని మాదిగలు, మాలలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటే చరిత్ర క్షమించదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికలలో బొంద పెట్టాలని, ఆ పార్టీకి గోరీ కట్టాలని లేదంటే చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. ఈసారి కేసీఆర్‌ను వదిలిపెడితే ఎవరినీ బతకనీయడని, కేసీఆర్‌ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమివేసేలా ఎన్నికల ఫలితాలు రావాలని పిలుపునిచ్చారు.

మోదీ, ఎన్నికల సంఘం, కేసీఆర్‌ కలసి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2014 ఓటర్ల జాబితాలో 2.81 కోట్ల మంది ఓటర్లుంటే 2018లో 2.6 కోట్లు ఉన్నట్లు చూపెడుతున్నారని, నాలుగేళ్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఓట్లు పెరగాలె కానీ, ఎలా తగ్గుతాయని ప్రశ్నించారు. తనకున్న సమాచారం మేరకు అక్టోబర్‌ రెండోవారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని, నవంబర్‌ 24న ఎన్నికలు జరుగుతాయని, ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు దళితులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌తోనే దళితులకు న్యాయం: పట్లోళ్ల
కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఆయన కానీ, ఆయన కుమారుడు కానీ ఏనాడూ భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌కు దండ వేయలేదని, కనీసం కూడా దండవేయని వాళ్లకు ఓట్లెందుకు వేయాలని కాంగ్రెస్‌ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌తోనే దళిత, అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు క్యామమల్లేశ్‌తో పాటు చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలే మా పిల్లలు
రాజకీయాల్లోకి రాకముందు తాను భారత సైన్యంలో, రాష్ట్రపతి కార్యాలయంలో పనిచేశానని ఉత్తమ్‌ చెప్పారు. తనకు పిల్లలు లేరని, తెలంగాణ ప్రజలే తమ పిల్లలని వ్యాఖ్యానించారు. తనతో పాటు తన భార్య పద్మావతి జీవితాలు తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్‌ కుటుంబానికి అంకితం చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు