ప్రగతి నివేదన సభ కాదు... ప్రజావేదన సభ: ఉత్తమ్‌

1 Sep, 2018 03:27 IST|Sakshi

సభ నిర్వహణకు రూ.300 కోట్లు ఎక్కడివి?

సాక్షి, హైదరాబాద్‌: ‘రూ.లక్ష కోట్ల అవినీతి, రెండు లక్షల కోట్ల అప్పులు, 5 వేల మంది రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆకలి చావులు, మహిళలకు అవమానాలు, రాజకీయ ఫిరాయింపులు, అభివృద్ధి పనుల పేరిట కమీ షన్లు, 500 కోట్లతో ప్రగతి భవన్, ప్రైవేట్‌ విమానాల్లో ప్రయాణాలు, తెలంగాణ ద్రోహులకు అందలం, అమరవీరులకు అవమానాలు... ఇవేనా తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి?’అని టీపీసీసీ చీఫ్‌ కెప్టెన్‌. ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోంది ప్రగతి నివేదన సభ కాదని, అదో ప్రజావేదన సభ అని అభివర్ణించారు. 2014 ఎన్నికల హామీ లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేయలేదని, ఈ విషయంపై కేసీఆర్‌ చర్చలకు వస్తారా అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన సవాల్‌ చేశారు.

ఉత్తమ్‌ ప్రకటనలోని ముఖ్యాంశాలు: ‘ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదు. తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకు భారీ సభ పేరుతో కేసీఆర్‌ కుయుక్తులు పన్నుతు న్నారు. దళిత, గిరిజన కుటుంబాలకు మూడెకరాల భూమి ఇచ్చారా.. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఏమయ్యాయి? నియోజకవర్గానికి లక్ష ఎకరాల్లో సాగునీరు ఏమైంది? 12 శాతం ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు ఏమయ్యాయి? ఇంటికో ఉద్యోగం, జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవన్నీ ఎక్కడికి పోయాయి? రైతుకు ఏకకాల రుణమాఫీ చేయలేదు.

అమరవీరులందరికీ సాయం చేయలేదు, అంతర్జాతీయ స్థాయి స్మారకం కడతామని చెప్పి కనీసం స్థలం కేటాయించలేదు. దాదాపు రూ.300 కోట్లతో ప్రగతి నివేదన సభ అంటూ తాను ఏదో చేసినట్టు ప్రచారం చేసు కుంటున్నారు. ఇంత డబ్బు టీఆర్‌ఎస్‌కు ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరం, మిషన్‌ కాకతీయ కమీషన్లు, మిషన్‌ భగరథలో మింగిన లం చాలతో సభలు జరిపినా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు. కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరు’అని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు