పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగేంతవరకూ పోరాటం

16 Jun, 2020 05:06 IST|Sakshi
సోమవారం గాంధీభవన్‌లో జరిగిన పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. చిత్రంలో నాగం, సంపత్‌ తదితరులు

ఆ ప్రాజెక్టు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఎండిపోతుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనీయబోమని, పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్‌ నాగం జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉత్తమ్‌ అతిథిగా హాజరయ్యారు. కమిటీ కన్వీనర్‌ టి.రామ్మోహన్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి ప్రసాద కుమార్, మాజీ ఎంపీ మల్లు రవిలతో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం సాగునీరు ప్రధాన ఎజెండాగా సాగిందన్నారు. గతంలో పోతిరెడ్డి పాడు విస్తరణ జరిగినప్పుడు కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నారని, ఆరుగురు టీఆర్‌ఎస్‌ మంత్రులు కూడా ఉన్నారని, అప్పుడు కిమ్మనని కేసీఆర్‌ ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌తో కలిసి కృష్ణా నీటిని ఆంధ్రకు తీసుకుపోయేలా సహకరిస్తున్నారని ఆరోపించారు. జీవోలిచ్చి పనులు ప్రారంభిస్తున్నా కేసీఆర్‌ అడ్డుచెప్పడంలేదన్నారు. కాంగ్రెస్‌ పోరాటం మొదలు పెట్టిన తర్వాత ఒక ప్రకటన చేశారని ఉత్తమ్‌ తెలిపారు. 

కేసీఆర్‌కు అవగాహన లేదు: నాగం
అనంతరం విలేకరులతో నాగం మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు విస్తరణతో దక్షిణ తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందన్నారు. నదీ జలాలపై కేసీఆర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్, జగన్‌లు సమావేశం అయ్యాకే జగన్‌ సంగమేశ్వర్‌ ప్రాజెక్టు జీవో ఇచ్చారని, దీంతో 170 టీఎంసీల నీటిని ఏపీ సర్కారు తరలించుకుని పోతోందన్నారు. కృష్ణా నుంచి పెన్నా బేసిన్‌కు తీసుకెళ్లాలని ప్రణాళిక రచించారని ఆరోపించారు. తమ కమిటీ కృష్ణా పరీవాహకంల్లోని అన్ని గ్రామాలు తిరుగుతుందని, కేసీఆర్‌ చేసుకున్న లోపాయికారి ఒప్పందాలను బయటపెడుతామని నాగం అన్నారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఏపీ తెచ్చిన 203 జీవోను  రద్దు చేయాలని, పాలమూరు రంగారెడ్డి పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. 

కమిటీ పేరు మార్పు
కాగా, పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ పేరును కృష్ణా నదీ జలాల పరిరక్షణ కాంగ్రెస్‌ కమిటీగా మార్చారు. తొలుత సమావేశంలో భాగంగా పోతిరెడ్డి పాడు విస్తరణపై నాగం జనార్దన్‌ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. 

కరోనా టెస్టులు ఉచితంగా చేయాలి  
గవర్నర్‌కు టీపీసీసీ లేఖ
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా కరోనా పరీక్షలు చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ పక్షాన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని, టెస్టులకయ్యే ఖర్చును ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు రీయింబర్స్‌ చేయాలని టీపీసీసీ నేతలు విన్నవించారు. 

మరిన్ని వార్తలు