హక్కులను ఉల్లంఘిస్తున్నారు

18 Apr, 2019 02:59 IST|Sakshi

రాజకీయ కక్షలకు పరాకాష్టగా కొండాపై కేసులు: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలకులు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా మానవ హక్కులనూ ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవమానించిన తీరు దారుణమని, దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన మంద కృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేయడం అమానవీయమని విమర్శించారు. అంబేడ్కర్‌ను టీఆర్‌ఎస్‌ అవమానించిన తీరును రాష్ట్ర ప్రజలు, దళిత సమాజం జాగ్రత్తగా గమనించాలని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. కనీసం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు కూడా సీఎం కేసీఆర్‌ రాకపోవడం దారుణమన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముక్కలుగా చేసి డంపింగ్‌ యార్డుకు తరలించడం లాంటి అమానవీయ, అప్రజాస్వామిక ఘటనలపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందిస్తుందన్నారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తుతామని, ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. రాజకీయ కక్షలకు పరాకాష్టగా టీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తోందని, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులు.. ఇదేమని అడిగినందుకు ఆయనపైనే అక్రమంగా తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. యావత్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో కొండా వెంట ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తుందని చెప్పారు.  

ప్రత్యక్షంగా అయితేనే..! 
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తే బాగుంటుందనేది తమ అభిప్రాయమని ఉత్తమ్‌ అన్నారు. అలా చేయడం ద్వారా రాజకీయాల్లో బేరసారాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. స్పష్టత ఉన్న దగ్గర తమ పార్టీ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఒకేసారి వెల్లడిస్తామని చెప్పారు.  

మరిన్ని వార్తలు