మద్యం, డబ్బు సంచులతో వస్తున్నారు జాగ్రత్త.. 

13 Oct, 2019 07:33 IST|Sakshi

సాక్షి, హుజుర్‌నగర్‌ : ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ నాయకులు మద్యం, డబ్బు సంచులతో గ్రామాల్లోకి వస్తున్నారని.. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మట్టపల్లి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మట్టపల్లి, రాంచంద్రాపురంతండా, బీమ్లాతండా, బోజ్యాతండా, క్రిష్ణాతండా, గుర్రంబోడు తండా, పెదవీడు, చింతలమ్మగూడెం, సుల్తాన్‌పూర్‌తండా, మఠంపల్లిల్లో, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్‌ హయాంలో తాను ఎంతో కృషిచేశానని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని ప్రజల నుంచి విడదీయలేక అధికార పార్టీ నేతలు డబ్బు, మద్యం సంచులతో వస్తున్నారని.. దానిలో భాగంగా లక్షల విలువచేసే మద్యం నిల్వలతో పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఉత్తమ్‌ కుటుంబానికే లాభమని కొంతమంది విష ప్రచారం చేయడం బాధాకరమన్నారు. మాకు పిల్లలులేని విషయం లోకమంతా తెలుసని అవసరంలేని సంపాదనను పక్కన పెట్టి ఈ ప్రాంతంలో రూ.వేలకోట్లతో చేపట్టిన పనులతో ప్రజాభిమానం చూరగొన్నామని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి ఇటీవల ఒక రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరిస్తే సదరు కాంట్రాక్టర్‌ తనకు ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. ఈ ఉపఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కెనడాకు తిరుగు ప్రయాణం తప్పదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని మఠంపల్లి, మేళ్లచెరువు, పాలకీడు మండలాలను కలుపుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య ప్యాసింజర్‌ రైలు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. హుజూర్‌నగర్‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకంలో భాగంగా హుజూర్‌నగర్‌ను స్మార్ట్‌ పట్టణంగా గుర్తించేందుకు కృషి చేస్తాన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెల్ల శారద, టీపీసీసీ కార్యదర్శలు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాధవి, అనిత, సాముల శివారెడ్డి, మంజీనాయక్, రాజారెడ్డి, కిషోర్‌రెడ్డి, నవీన్‌నాయక్, అప్పారావు, శ్రీనివాస్, భీముడు తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు