గల్ఫ్‌ కార్మికులకు అభయ ‘హస్తం’!

10 Nov, 2018 01:30 IST|Sakshi

అధికారంలోకి రాగానే ప్రత్యేక పథకాల అమలు: ఉత్తమ్‌

న్యాయ సాయం కోసం ‘గల్ఫ్‌ కార్పొరేషన్‌’ ఏర్పాటుకు భరోసా

కాంగ్రెస్‌ను గెలిపించాలని దుబాయ్‌లో కార్మికులను కోరిన పీసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబం కోసం గల్ఫ్‌ దేశాల్లో అనేక ఇబ్బందులు పడుతూ బతుకీడుస్తున్న కార్మి కుల కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. గల్ఫ్‌ కార్మికుల కోసం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించేందుకు ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి శుక్రవారం దుబాయ్‌లో పర్యటించారు.

అక్కడ టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ అధ్వర్యంలో అల్‌ఖ్వాజ్‌ ప్రాంతంలో కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. 10 లక్షల మందికి పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు గల్ఫ్‌ దేశాల్లో కష్టపడు తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వీరి కోసం ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. వివిధ దేశాల్లో ఉపాధి కోసం పని చేస్తున్న వారికి వైద్య సదుపాయాలు, ప్రమాదవశా త్తు ఎవరైనా మరణిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ సెంటర్లు ఉపయోగపడతాయని తెలిపారు. వంద రోజుల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకువస్తామని హామీనిచ్చారు.

కలెక్టరేట్లలో ఎన్‌ఆర్‌ఐ విభాగాలు..
ప్రతీ జిల్లాలోని కలెక్టరేట్లలో ఎన్‌ఆర్‌ఐ విభాగాలను ఏర్పాటు చేస్తామని ఉత్తమ్‌ చెప్పారు. ఆయా జిల్లాల్లోని గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అధికారులు చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.  గల్ఫ్‌ దేశాల్లోని తెలంగాణ ప్రజలు వారి సమస్యలను ఎంబసీల్లో చెప్పుకునేం దుకు అక్కడి భాషలు రాక ఇబ్బంది పడుతున్నారని, ఇందుకోసం కేంద్రంతో చర్చించి ఎంబసీల్లో  తెలుగు అధికారులను నియమించేలా కృషి చేస్తామన్నారు.

రూ.500 కోట్లతో కార్పస్‌ ఫండ్‌..
గల్ఫ్‌ కార్మికుల సంక్షేమం కోసం రూ.500 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ కింద నిధి ఏర్పాటు చేస్తామని ఉత్తమ్‌ తెలిపారు. రూ.5 లక్షల వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఆయా కుటుంబాలకు అంది స్తామన్నారు. మృతి చెందిన కార్మికుల పిల్లలకు విద్యతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామ న్నారు. రాష్ట్రంలోని అన్ని డివిజన్లలో నేషనల్‌ అకడమిక్‌ కన్‌స్ట్రక్షన్‌ విభాగం ద్వారా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు చేయూతనంది స్తామన్నారు.  


ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తాం..
గల్ఫ్‌ కార్మికులకు రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని ఉత్తమ్‌ హామీనిచ్చారు. అదే విధంగా గల్ఫ్‌ కార్మికులకు ఆరోగ్య, ప్రమాద బీమా పాలసీలు అందించడంతో పాటు పెన్షన్‌ పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గల్ఫ్‌లో ఇబ్బంది పడుతూ తిరిగి వస్తున్న వారికి రుణాలిచ్చి స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తామన్నారు.

కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు డిసెంబర్‌ 7న ఓటు వేసేం దుకు రావడంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఓట్లు వేయించాలని కార్మికులను ఉత్తమ్‌ కోరారు. సమావేశం అనంత రం కుంతియాతో కలసి కాంగ్రెస్‌ నేతలం తా దీపా వళి ధూమ్‌ధామ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు