‘పోతిరెడ్డిపాడు’ మీ ఇంటి సమస్య కాదు

20 May, 2020 03:04 IST|Sakshi

అది తెలంగాణ రైతుల సమస్య

గ్రావిటీ ద్వారా వచ్చే కృష్ణా నీటిని వదిలి

గోదావరి జలాల గురించి మాట్లాడడానికి ఇంగితం ఉండాలి

ఎస్‌... మేం కచ్చితంగా చెప్పేటోళ్లమే: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ వ్యాఖ్యలు

జూన్‌ 2న ఎస్సెల్బీసీ టన్నెల్‌ వద్ద దీక్షకు ప్రణాళిక... రాష్ట్రస్థాయి ఉద్యమానికి పిలుపు  

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరి, ఆయన మాటలపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు మండిపడ్డారు. ఇది ఆయన ఇంటి సమస్య కాదని, తెలంగాణ రైతుల సమస్య అని గ్రహించాలని నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డిలు వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌లతో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి చెందిన నీళ్లు, నిధులు కాపాడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కానీ, కేసీఆర్‌ ఉద్ధరిస్తాడని కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మాట్లాడే ఏ మాటకూ విలువ ఉండదని అన్నారు.

తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత కేసీఆర్‌పై లేదా అని ప్రశ్నించారు. తాము కచ్చితంగా కేసీఆర్‌కు చెప్పేటోళ్లమేనని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంకంటే రెండింతలు నీరు ఏపీ తరలించుకుపోతుంటే కేసీఆర్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నాడని, గ్రావిటీ ద్వారా వచ్చే కృష్ణా నీటిని వదిలిపెట్టి లిఫ్ట్‌ చేయాల్సిన గోదావరి నీళ్లపై మాట్లాడడానికి కేసీఆర్‌కు ఇంగితం ఉండాలని అన్నారు.

ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని, తెలంగాణ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్‌ 2న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఎస్సెల్బీసీ టన్నెల్‌ వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇవ్వనున్నట్టు ఉత్తమ్‌ వెల్లడించారు. తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తానని కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పలేదని, అలా అంటే రైతులు వ్యతిరేకిస్తారని ఉత్తమ్‌ చెప్పారు. రైతులు వారి భూములకు అనువైన పంటలనే వేసుకుంటారని వ్యాఖ్యానించారు.  

ఆ ప్రాజెక్టు ఎలా పూర్తయింది: కోమటిరెడ్డి 
తెలంగాణను, ముఖ్యంగా దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే జీవో 203ను తాము వ్యతిరేకిస్తున్నామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణను పద్ధ తి ప్రకారం ఎండబెట్టే కుట్ర చేస్తున్న కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి అని, ఆయన్ను బొంద పెట్టినా పాపం లేదని వ్యాఖ్యానించారు. కాం గ్రెస్‌ పార్టీ హయాంలో 70% పనులు పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయలేని అసమర్థు డు కేసీఆర్‌ అన్నారు. ఎస్సెల్బీసీ, డిండి, ఉద యసముద్రం ప్రాజెక్టుల చిన్న చిన్న పనులు పూర్తికానప్పుడు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజె క్టు ఎలా పూర్తయిందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ తన పక్కన బ్రోకర్లను పెట్టు కుని మాట్లాడుతున్నారని, శాసనమండలి చైర్మన్‌ ఒక రాజకీయ బ్రోకర్‌ అని, రాజ్యాంగ పదవిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అన్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై ప్రధానిని కలుస్తామని, పార్లమెంటులో పోరాటం చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు.

అవి వరద జలాలు ఎలా అవుతాయి: రేవంత్‌ 
పోతిరెడ్డిపాడుపై వీరోచిత పోరాటం చేసినట్టు కేసీఆర్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, కేసీఆర్‌ ఎప్పుడూ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడలేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక కూడా ఏపీ ప్రభుత్వం అదనంగా 11వేల క్యూసెక్కుల నీటిని తరలించినా ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తాము వరద జలాలను తీసుకెళ్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినట్టు కేసీఆర్‌ చెబుతున్నారని, 885 అడుగుల పైనుంచి తీసుకెళితే వరద జలాలు అవుతాయి కానీ, 790 అడుగుల నుంచి తీసుకుంటే వరద జలాలెలా అవుతాయని రేవంత్‌ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు జీవోకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా