కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి: ఉత్తమ్‌

4 Nov, 2018 02:08 IST|Sakshi

నల్లగొండ: ‘కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి జరుగుతున్న ఎన్నికలివి, రాష్ట్రంలో దుష్ట పాలన అంతం కావాలంటే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బొందపెట్టాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేం ద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో కేజీ టు పీజీ జేఏసీ ఏర్పా టు చేసిన విద్యాసంస్థల పరిరక్షణ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ ఉద్యమంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారని అన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, యాజమాన్యాలు సిబ్బందికి వేతనా లు ఇవ్వలేని స్థితి నెలకొందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్‌ను సీఎంని చేసిన జేఏసీ నేతలను బచ్చా కేటీఆర్‌ అవమాన పర్చేవిధంగా మాట్లాడారని ఆరోపించారు.

చిట్టెలుక మాటలు లెక్కచేయం: జానారెడ్డి
సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌.. కాంగ్రెస్, టీడీపీలను గుంటనక్క అని అంటున్నారని, అయితే ఆ చిట్టెలుక మాట్లాడే మాటలను తాము లెక్కచేయమని అన్నారు. ముందస్తు ఎన్నికలతో రూ.300 కోట్లు ఎన్నికల ఖర్చు పెట్టిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరముందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని విమర్శించారు. సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఒక కుటుంబం చేతిలో నలిగిపోతున్నారన్నారు.

ఎంతో మంది బలిదానాలు చేసి తెలంగాణ సాధిస్తే కేసీఆర్‌ అదంతా మరచి నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ, కేసీఆర్‌ అనే క్రూరమృగం జనావాసాల్లో ఉంటే ప్రమాదమని, దాన్ని చర్లపల్లి జైలుకు పంపాలంటే కూటమిని గెలిపించాలన్నారు. కేసీఆర్‌ కుటుంబానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. విద్యాసంస్థల సంఘం నాయకుడు నరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ సహా పలువురు మహాకూటమి నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు