టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకే కూటమి

27 Oct, 2018 01:18 IST|Sakshi
శుక్రవారం గాంధీభవన్‌లో ఓయూ విద్యార్థుల చేరిక సందర్భంగా మాట్లాడుతున్న ఉత్తమ్‌

కేసీఆర్‌ నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి: ఉత్తమ్‌ 

దేశంలోనే అత్యంత అవినీతిపరులు కేసీఆర్, కేటీఆర్‌ 

కేటీఆర్‌కు తెలివి తక్కువ.. పొగరు ఎక్కువ

సాక్షి, హైదరాబాద్‌: దుర్మార్గపు టీఆర్‌ఎస్‌ పాలనను బొందపెట్టేందుకే టీడీపీ, సీపీఐ, జన సమితిలతో కలసి కూటమి ఏర్పాటు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కూటమి పొత్తులపై కేసీఆర్‌ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎవరితో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్‌కు ఎందుకని మండిపడ్డారు. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ తెలంగాణ ద్రోహి అని అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్‌లు దేశంలోనే అత్యంత అవినీతిపరులని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలతో కేసీఆర్‌ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని, ఎన్నికల కోసం మిగిలిన 45 రోజులు నిద్రపోకుండా పనిచేసి దుర్మార్గపు పాలనను అంతమొందించాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ సమక్షంలో టీజీవీపీ రాష్ట అధ్యక్షుడు భట్టు శ్రీహరి నాయక్, బీఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెమ్మాది రవి, జేఏసీ నేత లక్పతి నాయక్‌ల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరారు. రామగుండంకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఉత్తమ్‌ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్యేక రాష్ట్ర ముసుగులో కేసీఆర్‌కు అధికార, ధన దాహం దాగి ఉందనే విషయాన్ని గుర్తించలేకపోయామని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతోనే తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కేసీఆర్‌ ఇప్పటికే రూ.5 కోట్లు చొప్పున పంపిణీ చేశారని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. 

విద్యార్థుల త్యాగాలతోనే అధికారం 
విద్యార్థుల త్యాగాలతో సీఎం కుర్చీనెక్కి, వందల కోట్లు సంపాదించిన కేసీఆర్‌.. విద్యార్థులను విస్మరించాడని ఉత్తమ్‌ ఆరోపించారు. సీఎం అయ్యాక ఒక్కసారి కూడా ఓయూ విద్యార్థులతో మాట్లాడలేదన్నారు. తెలంగాణ వస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు భావిస్తే కనీసం ఖాళీలను కూడా భర్తీ చేయలేని అసమర్థుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. ఓయూకు వచ్చే సైన్స్‌ కాంగ్రెస్‌ తరలిపోవడానికి కారణం కేసీఆర్‌ అని, ఓయూకు రాకుండా రాహుల్‌ను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌కు మనసు ఒప్పలేదని, ఆయన ఇంటిని మాత్రం వందల కోట్లతో కట్టుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ పతనం ప్రారంభమైందని పార్టీలో చేరిన విద్యార్థి నేత శ్రీహరినాయక్‌ అన్నారు. ఉద్యమంలో స్వీట్లు పంచి.. ఇప్పుడు ప్రగతి భవన్‌ గేట్లు మూశారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతా రాయ్, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, టీపీసీసీ నేతలు బండ్ల గణేశ్, చామకూరి శ్రీధర్‌గౌడ్, చరణ్‌ కౌశిక్‌యాదవ్, చెనగాని దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

కేటీఆర్‌... ఓ బచ్చా 
కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ ఓ బచ్చా అని, ఆయనకు తెలివి తక్కువ.. పొగరు ఎక్కువని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీ ఇస్తే దక్షిణ రాష్ట్రాల బడ్జెట్‌ కావాలని, సాధ్యం కాదని అవహేళన చేసి ఎలా ఇస్తారని ప్రశ్నించారన్నారు. గతంలో ఉచిత విద్యుత్, రుణమాఫీ. ఇతరత్రా అమలు చేసినట్లే చేస్తా మంటే వెంటనే కాపీ మాస్టర్‌ కేసీఆర్‌ కాపీ కొట్టి అదనంగా రూ. 16 పెంచడానికి సిగ్గూ శరమూ లేదా అని విమర్శించారు. డిసెంబర్‌ 12న కాంగ్రె స్‌ అధికారం చేపట్టడం ఖాయమని, అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాల భర్తీ.. మెగా డీ ఎస్సీ నిర్వహిస్తామన్నారు. ఖాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ సాధించి తీరుతామన్నారు.

మరిన్ని వార్తలు