కేసీఆర్‌కు ఝలక్‌ ఇవ్వాలి : ఉత్తమ్‌

10 Jan, 2020 16:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్‌, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్‌ లిస్ట్‌, రిజర్వేషన్‌లు ప్రకటించకుండా షెడ్యూల్‌ విడుదల చేశారన్న ఉత్తమ్‌.. తమ అభ్యంతరాలను ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఝలక్‌ ఇవ్వాలని ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలను ఎదుర్కొని కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్‌ శ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరేళ్ల కాలంలో మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు చేసిందేమీ లేదని విమర్శించారు. 

టీఆర్‌ఎస్‌ డబ్బులు ప్రవాహంతో గెలిచే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఏం చేశారని టీఆర్‌ఎస్‌ నాయకులు ఓట్లు అడగబోతున్నారని ప్రశించారు.. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌.. ఏ ఒక్కరికైనా ఇచ్చిందా అని నిలదీశారు. ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదని.. రెండో పంటకు రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఝలక్‌ ఇవ్వాలని ప్రజలను కోరారు. 

నోట్ల రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ రెండు పార్టీలు కుమ్మకయ్యాయని.. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ తీర్మానం చేయకున్నా.. మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై మైనార్టీ సోదరులు ఆలోచించాలని కోరారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా