అప్పులకు తగిన అభివృద్ధి జరగలేదు

2 Jun, 2019 14:21 IST|Sakshi
గాంధీభవన్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న ఉత్తమ్, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : స్వరాష్ట్రం ఏర్పాటైన ఐదేళ్లలో రూ.2.60 లక్షల కోట్లు అప్పు అయిందని, అందుకు తగిన అభివృద్ధి మాత్రం జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడంలో మాత్రం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ఐదో ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోనియాగాంధీ చలువ, కాంగ్రెస్‌ ఎంపీల పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని అన్నారు.  గత 60 ఏళ్లలో రాష్ట్రానికి రూ.69 వేల కోట్ల అప్పు అయితే, తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లలో అది రూ.2.60 లక్షల కోట్లకు చేరిందన్నారు.  తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టం లోని హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.  నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంతవరకు రూపొందించలేదన్నారు. టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజలు గమనించినందునే లోక్‌సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు.  

మరిన్ని వార్తలు