కాంగ్రెస్‌కు అధికారం ఖాయం

6 Apr, 2018 00:46 IST|Sakshi

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టాలి

నర్సంపేట సభలో ప్రజలకు పిలుపు  

సాక్షి వరంగల్‌ రూరల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాలు భర్తీ చేయలేని అసమర్థుడని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో గురువారం రాత్రి జరిగిన ప్రజా చైతన్య బస్సుయాత్ర సభలో ఆయన మాట్లాడారు. డిసెంబర్‌లోనే శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.

కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రం నుంచి కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జలకు రూ.2 వేలు, పత్తికి రూ. 6 వేలు, పసుపు, మిర్చికి రూ.10 వేలు మద్దతు ధర కల్పిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 6 లక్షల మహిళా సంఘాలు, 70 లక్షల మహిళలకు చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.లక్ష, వడ్డీ లేకుండా రూ.10 లక్షల రుణాలు అందిస్తామని తెలిపారు.

లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కాగ్‌ రిపోర్ట్‌లో దోషిగా తేలిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ, రైతు రుణమాఫీ లాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలిపారు.

శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ నర్సంపేట సభను చూస్తే కేసీఆర్‌ నిద్రపోడన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ నక్సలైట్ల ఎజెండా అన్నావు.. వచ్చిన తెలంగాణలో ఎన్‌కౌంటర్లు, ఆత్మహత్యలు ఉండవన్నావు.. ఇవన్నేమిటని ప్రశ్నించారు. తమ అవినీతి బయటపడుతుందని కాంగ్రెస్‌ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేసి బయటకు పంపారని ఆరోపించారు. ఆంధ్రా హీరోయిన్లతో క్యాట్‌వాక్‌ చేసే కేటీఆర్‌ ఉద్యమ నాయకుడా అని విమర్శిం చారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల క్రితం హన్మకొండకు వచ్చిన సీఎం కేసీఆర్‌ 100 హామీలు ఇచ్చాడని, అందులో ఒక్క హామీ నెరవేర్చినా తాను హన్మకొండ చౌరస్తాలో ఉరివేసుకుంటాను.. హామీలు నెరవేర్చకుంటే అదే చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తావా అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. సభలో వి.హన్మంతరావు, నంది ఎల్లయ్య, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బలరాంనాయక్, సంపత్‌కుమార్, సీతక్క, వేం నరేందర్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు