అప్పులు.. తప్పులు!

6 Apr, 2018 00:54 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కారు పాలన ఇదే: కాంగ్రెస్‌

‘కాగ్‌ అద్దంలో కేసీఆర్‌ అబద్ధాలు’ పేరిట పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

బడ్జెట్‌లో తప్పుడు లెక్కలతో ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థలను మోసగించారు

అప్పులను ఆదాయంగా చూపి.. మరిన్ని అప్పులు

రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ. 63,142 అప్పు

నాలుగేళ్లుగా బడ్జెట్‌ లోపాలు చెబుతూనే ఉన్నాం

ఇప్పుడు కాగ్‌ ఇదే స్పష్టం చేస్తోంది

రాష్ట్ర భవిష్యత్తుకు ఇది ప్రమాద సంకేతం: ఉత్తమ్‌

నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్‌ రాజీనామా చేయాలి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తప్పుడు పాలనతో రాష్ట్రం అప్పుల పాలవుతోందని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. బడ్జెట్‌లో అంకెల గారడీ చేస్తూ.. అప్పులను ఆదాయంగా చూపుతూ.. మరిన్ని అప్పులు తెస్తూ.. అటు ప్రజలను, ఇటు రాజ్యాంగ వ్యవస్థలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని విమర్శించింది. లోటు బడ్జెట్‌ను మిగులు బడ్జెట్‌గా ఎక్కువ చేసి చూపడం వల్ల సంక్షేమ రంగాలు అన్యాయానికి గురవుతున్నాయని పేర్కొంది.

ఈ అంకెల గారడీని కాగ్‌ లెక్కలతో సహా ఎండగట్టిందని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఏకంగా రూ.63,142 అప్పు పేరుకుపోయిందని లెక్కలు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌పై ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌)’ఆక్షేపించిన అంశాలతో ‘కాగ్‌ అద్దంలో కేసీఆర్‌ అబద్ధాలు’పేరిట టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం వరంగల్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాగ్‌ పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తుర్పారబట్టారు.

కేసీఆర్‌ ఇంటి విషయం కాదిది..
రాష్ట్ర బడ్జెట్‌ కేసీఆర్‌ ఇంటి విషయం కాదని, అది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులను ఆదాయంగా చూపుతున్న వైనంపై నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని.. ఇప్పుడు కాగ్‌ నివేదిక ఇదే నిజాన్ని బయటపెట్టిందని చెప్పారు. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం అప్పు రూ.61,711 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ. 1.80 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు.

దీనికి బ్యాంకులు, సంస్థల అప్పులను కలిపితే రూ. 2.21 లక్షల కోట్లకు చేరుతోందని చెప్పారు. ఈ లెక్కన తెలంగాణలో సగటున ప్రతివ్యక్తిపై రూ.63,142, ప్రతి కుటుంబంపై రూ.2.65లక్షలు, ఒక్కో గ్రామంపై రూ.21 కోట్లు, ఒక్కో మండలంపై రూ.370 కోట్లు, ఒక్కో జిల్లాపై రూ. 7,000 కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. అసలు రాష్ట్ర ఆదాయంలో మూడో వంతు అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతోందని ఉత్తమ్‌ చెప్పారు.

‘పరిమితి’నిబంధనను తుంగలో తొక్కి..
కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బడ్జెట్‌ లెక్కలను తారుమారు చేస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. ‘‘ఆర్థిక నిర్వహణ జవాబుదారీ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం), 14 ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం... రాష్ట్ర జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్రీయోత్పత్తి)లో మూడు శాతానికి మించి అప్పులు చేయరాదు. కానీ ఇక్కడ కావాలని మిగులు బడ్జెట్‌ను చూపిస్తూ 3.5 శాతం దాకా అప్పులు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందింది. వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి తీసుకున్న అప్పులను కూడా కలిపితే ఈ మొత్తం 4.7 శాతానికి చేరుకుంటోంది.

ఉదాహరణకు రాష్ట్ర ఆదాయం రూ.82,818 కోట్లు, వ్యయం రూ.81,432 కోట్లు, మిగులు రూ.386 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపించింది.. దీనిని పరిశీలించిన కాగ్‌ వాస్తవ ఆదాయం రూ.80,318 కోట్లు, ఖర్చు రూ.85,710 కోట్లు, లోటు రూ.5,392 కోట్లుగా తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం, కాగ్‌ లెక్కల్లో తేడా ఏకంగా రూ.6,778 కోట్లుగా ఉంది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాద సంకేతం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి..’’అని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

సంక్షేమానికి కోతలు..
లోటు బడ్జెట్‌ను ఎక్కువ చేసి మిగులు బడ్జెట్‌గా చూపడం వల్ల సంక్షేమ రంగాలు అన్యాయానికి గురవుతున్నాయని ఉత్తమ్‌ పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న మొత్తాలకు, వాస్తవ వ్యయానికి పొంతనే ఉండటం లేదని... విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువని చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయిస్తూ.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. నిధుల్లేక నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఇంకా 45 శాతం బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం లో నాలుగు లక్షల మంది దళితులకు భూము లు ఇస్తామని చెప్పి.. ఇప్పటివరకు 12,587 మందికే పంచారని చెప్పారు.

గత నాలుగేళ్లలో అమరవీరుల సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 71 శాతం, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌లకు 38.76శాతం, రోడ్లు–భవనాల శాఖకు 44.17 శాతం, పంచాయతీరాజ్‌కు 32.59 శాతం, పురపాలకశాఖకు 53.98 శాతం, బీసీ సంక్షేమ నిధులకు 41.8 శాతం కోత పెట్టారని వివరించారు. అ«ధిక రేటుకు విద్యుత్‌ కొనుగోళ్లతో రూ.5,528 కోట్లు, నాసిరకం బొగ్గు కొనుగోలుతో రూ.256 కోట్లు, అసమర్థ నిర్వహణ వల్ల రూ.789 కోట్లు నష్టం వాటిల్లినట్లు కాగ్‌ తేల్చిందని ఉత్తమ్‌ తెలిపారు. రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం సాయం అందివ్వలేదని, గిట్టు బాటు« ధర కల్పించలేదని విమర్శించారు.

తప్పుడు లెక్కలతో మోసం: జానారెడ్డి
ఉద్దేశపూర్వకంగా బడ్జెట్‌లో తప్పుడు అంచనాలు పెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని.. టీఆర్‌ఎస్‌ సర్కారు అప్పులను ఆదాయంగా చూపుతూ చివరికి నిధుల్లేక సంక్షేమ రంగానికి కోతలు పెడుతోందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌పై కాగ్‌ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

2016–17 బడ్జెట్‌పైనే కాగ్‌ నివేదిక వచ్చిందని, 2017–18 నివేదిక వస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇక అప్పును ఆదాయంగా చూపించడం, కరెంటును కొంటూ ఉత్పత్తిగా చూపించడం నేరమని.. ఇలాంటి తప్పుడు లెక్కలతో బడ్జెట్‌ రూపొందించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు.

అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తప్పు కాదని.. ఆడంబరాలు, కమీషన్ల కోసం అప్పులు చేయడం సామాజిక నేరమని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపకర్త, కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్, నంది ఎల్లయ్య, బలరాం నాయక్, నాయిని రాజేందర్‌రెడ్డి, బండ కార్తీక, నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు