మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది 

23 Mar, 2019 01:12 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

నల్లగొండ ఎంపీ స్థానానికి నామినేషన్‌ దాఖలు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేంద్రంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్‌ మతాలు, వర్గాలుగా ప్రజలను విభజించి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలోని మెనార్టీలు అభద్రతా భావంతో జీవిస్తున్నారని విమర్శించారు. 2014లో మోదీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అందులో భాగంగా నల్లధనాన్ని రాబట్టి ప్రజలందరి ఖాతాలో జమ చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. ప్రధానిగా రాహుల్‌ కావాలా.. మోదీ కావాలా.. అన్న చర్చ  దేశవ్యాప్తంగా జరుగుతోందని,  పోటీ వీరిద్దరి మధ్యనేనన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.

 ఇప్పుడున్న ఎంపీలతో కేసీఆర్‌ ఏం సాధించారు? 
వివిధ పార్టీలనుంచి చేరినవారితో కలిపి రాష్ట్రంలో మెజారిటీ ఎంపీలంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, కేసీఆర్‌ ఈ ఐదేళ్ల కాలంలో వారితో కేంద్రం నుంచి సాధించింది ఏమీ లేదని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. ఉన్న ఎంపీలతో ఏమీ చేయలేని కేసీఆర్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. గిరిజనులకు విశ్వవిద్యాలయం సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఐటీఐఆర్‌ విషయంలోనూ అదే జరిగిందని, భారీ ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించలేక చతికిల పడ్డారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలోనూ నిర్లక్ష్యమే జరిగిందని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ సీఎంపై గౌరవం లేదన్నారు. భూ కబ్జాదారులకు టీఆర్‌ఎస్‌ టికెట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలను అవమానించిందని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌ నాయక్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు