‘హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రైల్వేలైన్‌’

10 Apr, 2019 12:37 IST|Sakshi

సూర్యాపేట: తాను నల్లగొండ ఎంపీగా గెలవగానే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట, కోదాడ మీదుగా విజయవాడ వరకు కొత్త రైల్వేలైన్‌ను నిర్మించి సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. అలాగే.. ఎస్సారెస్పీ ద్వారా సూర్యాపేట ప్రాంతానికి నీటిని అందించి సస్యశ్యామలం చేస్తానని చెప్పారు.

16 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెబుతున్న కేసీఆర్, కేటీఆర్‌ ఇప్పుడు 16 మంది ఎంపీలు ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు.  ఐదు పర్యాయాలుగా శాసనసభ్యుడిగా ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. ఉత్తమ్‌ చేసిన అభివృద్ధి ఏమిటో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల ప్రజలను ఒకసారి అడిగితే చెబుతారని చెప్పారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే పేదల కష్టాలు తీరుస్తారని.. అన్ని పేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల చొప్పున ఆర్థికసాయం అందించడంతో పాటు రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ, ధాన్యానికి క్వింటాకు రూ. 2 వేలమద్దతు ధర కల్పిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. రోడ్‌ షోలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు