‘ఈటల రాజేందర్ పనైపోయినట్టే’

8 Mar, 2018 20:33 IST|Sakshi
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హుజురాబాద్: ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో గురువారం కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెట్టే ఫ్రంట్ బూటకమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు ఈ సభే సమాధానం చెబుతుందన్నారు. ఈ సభని చూస్తే మంత్రి ఈటల రాజేందర్ పనైపోయినట్టే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే విలాసవంతమైన జీవితం గడుపుతోందన్నారు. డిసెంబర్ లో ఎన్నికలు వస్తున్నందునే మే నెలలో వ్యవసాయ పెట్టుబడి ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారని వెల్లడించారు.  వ్యవసాయ పెట్టుబడి కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 వేల మంది రైతులు చనిపోతే వారి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతుందని, 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కొత్త నాటకం: కుంతియా
కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాగుతున్న యాత్ర 4 జిల్లాలు,17 నియోజక వర్గాల్లో విజయవంతం అయిందని కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ది చేకూరిందన్నారు. మోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. మోదీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని బయటికి మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కలిసికట్టుగా పని చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు