కాంగ్రెస్‌లో రెబెల్స్‌ వద్దు 

12 Jan, 2020 02:20 IST|Sakshi

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇస్తేనే కేసీఆర్‌కు గుణపాఠం 

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెబెల్స్‌ ఉండొద్దని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. ఈ ఎన్నికల్లో గెలుపు పార్టీకి చాలా కీలకమని, నేతలు సమన్వయంతో వ్యవహరించాలని, ఒకరి కంటే ఎక్కువ మంది కాంగ్రెస్‌ అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేసుకుంటే అధికారిక అభ్యర్థి మినహా అందరూ ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల వ్యూహంపై శనివారం గాంధీభవన్‌ నుంచి ఆయన పట్టణ, నగర కాంగ్రెస్‌ నేతల తో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలను గత ఆరేళ్లుగా టీఆర్‌ఎస్‌ ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో ప్రజలకు వివరంగా చెప్పా లని కోరారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి బాగాలేదని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ) నివేదిక ఇచ్చిందని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని ఆ నివేదికలో సూచిం చిందని ఉత్తమ్‌ చెప్పారు.

కానీ టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు వచ్చే నిధులను కూడా ఇతర అవసరాలకు వాడుకుని కోత పెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి షాక్‌ ఇస్తేనే కేసీఆర్‌కు గుణపాఠం వస్తుందన్నారు. బీజేపీ–టీఆర్‌ఎస్‌–ఎంఐఎం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ఉత్తమ్‌ కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఆయా మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామో ప్రజలకు చెప్పి ఓట్లడగాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇటీవలి ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయని, చాలా చోట్ల బీజేపీని గద్దెదించి కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.   

>
మరిన్ని వార్తలు