అగ్రిగోల్డ్‌ బాధితుల సొమ్ము ఇప్పిస్తాం: ఉత్తమ్‌

25 Jun, 2018 03:11 IST|Sakshi
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలోకి రా గానే అగ్రిగోల్డ్‌ సంస్థ చేతి లో మోసపోయిన వారిని ఆదుకుంటామని, బాధితుల సొమ్ము ఇప్పిస్తా మని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అగ్రిగోల్డ్‌ బాధితులతో ఆయన సమావేశమయ్యారు. అగ్రిగోల్డ్‌ బాధితులు తాము మోసపోయిన వైనాన్ని ఉత్తమ్‌కు వివరించారు.  బాధితులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని,  తాము అధికారంలోకి వచ్చి అగ్రిగోల్డ్‌ బాధితుల సొమ్మును తిరిగి ఇప్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. పొంగులేటి  మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వీరికి న్యాయం చేయకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

కొత్త టీం పని ‘షురూ’! 
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షణకుగాను కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు అప్పుడే తమ పని ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్‌ కృష్ణన్, సలీం అహ్మద్, డీఎస్‌ బోసురాజులు సోమవారం హైదరాబాద్‌ రానున్నారు. దక్షిణ, ఉత్తర, మధ్య తెలంగాణ ఇన్‌చార్జులుగా పని విభజన చేసుకున్న వీరు గాంధీభవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కలతో పాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, సంస్థాగత వ్యవహారాలు, పోలింగ్‌బూత్‌ స్థాయి కమిటీలు, శక్తి యాప్‌లో కార్యకర్తల నమోదు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం 100 రోజుల పార్టీ ప్రణాళికపై కూడా రాష్ట్ర నేతలతో వీరు చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 

కబ్జాదారును ఎలా చేర్చుకున్నారు?
దానం నాగేందర్‌ తమ పార్టీ లో ఉన్నప్పుడు ఆయన ఓ భూకబ్జాదారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారని.. అలాంటి వ్యక్తిని ఇప్పుడెలా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేతలు ప్రశ్నించారు. ఆదివారం గాంధీభవన్‌లో మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. దానం భూకబ్జాదారుడైతే టీఆర్‌ఎస్‌లో ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలని పొన్నం డిమాండ్‌ చేశా రు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌ను దానం నాగేందర్‌ విమర్శించడం సరైంది కాదని, బీసీలకు ఉన్నత పదవులిచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. టీఆర్‌ఎస్‌ బీసీలకు ఎంత బడ్జెట్‌ కేటాయించిందో.. అందు లో ఎంత ఖర్చు చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. దానం కాంగ్రెస్‌ను వదిలి పోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. దానం ఒక బచ్చా అని, ఆయన కాంగ్రెస్‌ను వీడటం వల్ల హైదరాబ బాద్‌లో పార్టీ బలం ఇంకా పెరుగుతుందని చెప్పారు. దానం అగ్రవర్ణాల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు.

అప్పుల్లోనే ప్రగతి: జీవన్‌రెడ్డి 
బుగ్గారం (ధర్మపురి): రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా అభివృద్ధికన్నా అప్పుల్లోనే ప్రగతి కనిపిస్తోందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ధర్మపురిలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కమీషన్ల కోసమే మిషన్‌ భగీరథను చేపట్టిందని ఆరోపించారు. ఎక్కడి గ్రామాలకు అక్కడే జలశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేస్తే చాలా పెద్ద మొత్తంలో నిధులు మిగులుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పు రూ.60 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం రూ.2.20 లక్షల కోట్లకు చేరిందన్నారు. గ్రామాల్లో భగీరథ పనులతో రహదారి వ్యవస్థ చిన్నాభిన్నమైందని ధ్వజమెత్తారు. యువత ఉద్యోగాలకోసం ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రెండు డీఎస్సీలు నిర్వహిస్తే ఇక్కడ ఒక డీఎస్సీకే డీలా పడిపోతున్నారని విమర్శించారు.  

మరిన్ని వార్తలు