‘అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తాం’

13 Sep, 2018 14:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికారంలోకి రాగానే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌(సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో పీఆర్టీయూ అధ్యక్షులుగా పనిచేసిన వెంకట్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తమ్‌ ప్రకటించారు. అనంతరం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనలో టీచర్లకు ప్రమోషన్లు లేవని ఆరోపించారు. లక్షకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తి చేయలేదన్నారు.

అధికారంలోకి రాగానే టీచర్లకు ప్రమోషన్లతో పాటు, ఖాళీలను భర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి మంచి ఐఆర్‌ కల్పిస్తామన్నారు.  అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగభృతిని అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతలు మధుయాష్కి, మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్‌, జీవన్‌ రెడ్డి తదితరులతో కలిసి కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై సీపీఐ, టీడీపీలతో ఎలాంటి చర్చ జరగలేదని, తెలంగాణను ఎలా రక్షించాలన్నదే చర్చించామని ఒక్క ప్రశ్నకు సమాధానంగా ఉత్తమ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు