దొంగనాటకాలు ప్రజలు గమనించాలి

29 Dec, 2019 03:41 IST|Sakshi
శనివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ప్రసంగిస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌. చిత్రంలో కుంతియా, భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ తదితరులు

బీజేపీ నిర్ణయాలన్నింటికీ టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చింది

మా నిరసనలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు

‘సత్యాగ్రహ దీక్ష’లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపాటు

‘సేవ్‌ ఇండియా ర్యాలీ’కి అనుమతివ్వని పోలీసులు

గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత... కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దొంగనాటకాలను ప్రజలు గమనించాలని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. పెద్ద నోట్ల రద్దు నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటా బీజేపీకి మద్దతిచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకూ అనుమతివ్వడం లేదన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఎన్నార్సీకి వ్యతిరేకంగా ‘సేవ్‌ ఇండియా’పేరుతో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ఒక్క తెలంగాణలో తప్ప దేశమంతా అనుమతినిచ్చారని చెప్పారు. 

ఎన్నార్సీకి నిరసనగా శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన ‘సత్యాగ్రహ దీక్ష’లో ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వం పేరుతో దేశంలో కల్లోల వాతావరణానికి బీజేపీ కారణమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక విధానాలకు కట్టుబడి ఉందని, అందరూ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతకు భృతి, రైతు రుణమాఫీ, రైతు బంధు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు, మూడెకరాల భూపంపిణీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు... ఇలా అన్ని విషయాల్లో టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని చెప్పారు. 

ప్రజల్ని మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత కూడా లేదని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తామేమీ మున్సిపల్‌ ఎన్నికలకు భయపడడం లేదని, రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత నామినేషన్ల దాఖలు కొంత సమయం మాత్రమే అడిగామని చెప్పారు. అయినా ఓటరు జాబితా, రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఘనత తెలంగాణ ఎన్నికల కమిషన్‌కే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. 

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..నిరసన ర్యాలీ శాంతియుతంగా చేస్తామన్నా అనుమతించకపోవడం దారుణమని, తెలంగాణలో ఆర్‌ఎస్‌ఎస్‌కి ఒక న్యాయం, కాంగ్రెస్‌ పార్టీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు వారి పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. దేశంలో, రాష్ట్రంలో నియంత పాలనకు త్వరలోనే స్వస్తి పలుకుతామని ధీమాను వ్యక్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా మాట్లాడుతూ..తెలంగాణలో కేసీఆర్, ఎంఐఎం పార్టీలు మోదీ కోసం పనిచేస్తున్నాయని, అందుకే తిరంగా ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టడం అన్యాయమని, అందుకే ఎన్నార్సీని కాంగ్రెస్‌ విమర్శిస్తోందని చెప్పారు. 

అనంతరం టీపీసీసీ నేతలు సత్యాగ్రహ దీక్షను విరమించారు. ఈ దీక్షలో సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, మర్రి శశిధర్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ ఎంపీ వీహెచ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రావణ్‌కుమార్, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు బల్మూరి వెంకట్‌రావు, అనిల్‌కుమార్‌ యాదవ్, నేరెళ్ల శారద, టీపీసీసీ నేతలు ఇందిరా శోభన్, ఫిరోజ్‌ఖాన్, గౌస్‌లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.  

ఉద్రికత్తల నడుమ 
కాంగ్రెస్‌ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అంతకుముందు గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ తలపెట్టిన ‘సేవ్‌ ఇండియా ర్యాలీ’కి పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఆ పార్టీ నేతలతో కలసి ఆయన గాంధీభవన్‌లోనే సత్యాగ్రహ దీక్షకు దిగారు. గాంధీభవన్‌ పరిసరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పహారా ఏర్పాటు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల నడుమ వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. గాంధీభవన్‌కు వస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు బయటే అడ్డగించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.  

టీఆర్‌ఎస్‌ పతనానికి ఈ దీక్ష వేదిక ప్రతిన పూనాలి: భట్టి 
టీఆర్‌ఎస్‌ పతనానికి సత్యాగ్రహ దీక్ష వేదికగా ప్రతిన పూని కాంగ్రెస్‌ కార్యకర్తలు ముందుకెళ్లాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశ విభజనకు కారణమవుతున్న చట్టాలను వ్యతిరేకిస్తూ దేశాన్ని ఓ కుటుంబంలాగా ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. అందుకే ఎన్నార్సీకి వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తున్నామని చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహిస్తే టీఆర్‌ఎస్‌ నిజస్వరూపం బయటపడుతుందనే దుర్మార్గపు ఆలోచనతో, ఆందోళనతో ఆ పార్టీ తమకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.

నాటి బ్రిటిష్‌ పాలనలో కూడా ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహం చేసేందుకు అనుమతి వచ్చిందని, సామాజ్య్రవాద శక్తుల కంటే కేసీఆర్‌ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు కలసి బీజేపీ అధికారంలోకి రావడానికి పునాదులు వేస్తున్నాయని, హైదరాబాద్‌లోని ఈ రెండు పార్టీలను కదిలించకపోతే రాష్ట్రంలో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదన్నారు. ఈ ఒక్కరోజు దీక్ష ఆపినంత మాత్రాన కాంగ్రెస్‌ పని అయిపోలేదన్నారు. ప్రతి ఇంటి గుండెను, గ్రామాన్ని, పట్టణాన్ని పలకరించి కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు.  

>
మరిన్ని వార్తలు