‘ఏం తింటున్నావ్‌.. ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావ్‌?’

3 Nov, 2018 14:32 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో అభివృద్ధి కంటే.. ఏం తింటున్నావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావ్ అనే చర్చే ఎక్కువైందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం బాగ్ అంబర్‌పేట్‌లో జరిగిన జమైతా ఉలుమా తెలంగాణ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సాధనలో జమైతా ఉలుమా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిందన్నారు. కాగా గత నాలుగున్నరేళ్లుగా ఎన్డీయే పాలనలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. మోదీ సర్కారు మైనార్టీల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించేది కేవలం కాంగ్రెస్‌ పార్టీయేనని పునరుద్ఘాటించారు.

కేసీఆర్‌ మోదీ ఏజెంట్‌..
అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల్లో.. మైనారిటీలకు 12 శాతం రేజర్వేషన్ కల్పిస్తామంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కేవలం రంజాన్ దావత్‌ ఇచ్చి బిర్యానీ పెడితే సరిపోతుందా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మోదీ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 4 శాతం రిజర్వేషన్లతోనే మైనార్టీ పిల్లలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ సీట్లు సాధించి ఉన్నత విద్యనభ్యసించారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు