మేం ‘పక్కాలోకల్‌’..

24 Sep, 2018 01:33 IST|Sakshi

స్థానిక సమస్యల వ్యూహంతో ఎన్నికల బరిలోకి ఉత్తమ్‌ టీం

ప్రజా వ్యతిరేకత ఉన్న 40 టీఆర్‌ఎస్‌ సీట్లపై గురి

స్థానిక సమస్యలు, పెండింగ్‌ హామీలే ప్రచారాస్త్రాలు

8 మంది మంత్రులను ఓడించడంపైనా కార్యాచరణ

బలమైన నేతలున్న మరో 20 స్థానాల్లో ‘వన్‌ మ్యాన్‌ షో’

ఎల్‌డీఎంఆర్‌సీ పేరుతో రిజర్వుడ్‌ స్థానాల్లో ఇప్పటికే క్షేత్రస్థాయికి..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ పక్కా వ్యూహాలు రచిస్తోంది. టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకోవడంతోపాటు స్థానిక సమస్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

పెండింగ్‌లో ఉన్న హామీలు, సమస్యలను నియోజకవర్గాలవారీగా గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని ఉత్తమ్‌ టీం రచిస్తోంది. ఇలాంటి పరిస్థితి కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో ఉందని అంచనా వేస్తోంది. అలాగే తాము బలంగా ఉన్న 20 స్థానాల్లో వన్‌మ్యాన్‌ షో చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వ్‌డ్‌ కాన్‌స్టిట్యుయెన్సీస్‌ (ఎల్‌డీఎంఆర్‌సీ) పేరుతో ఇప్పటికే రాష్ట్రంలోని 31 రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో శ్రేణులను కార్యక్షేత్రంలోకి దించింది.

మొదటిసారి గెలిచిన వారే టార్గెట్‌...
గత ఎన్నికల్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఎక్కువగా అసంతృప్తి ఉందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. జిల్లాకు ఒకరిద్దరు మినహా కొత్తగా గెలిచిన వారిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదని, ఆశించిన స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి జరగకపోవడంతోపాటు ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో వారు విఫలమయ్యారని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లక్ష్యంగా గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని యోచిస్తున్నారు.

ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుంటున్నారు. గత ఎన్నికల హామీల్లో అమలుకు నోచుకోని అంశాలను ప్రచారంలో లేవనెత్తుతామని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ రాష్ట్రస్థాయి నేత తెలిపారు. తొలిసారి గెలిచిన వారిలో ఎక్కువ శాతం మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, స్థానికంగా అనేక దందాలు చేసినట్లు ప్రజలు గ్రహించారని, వారి అక్రమాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సర్వేల్లోనే 39 మంది సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఉందని తేలిందని, ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలను మోహరించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

ముఖ్య నేతలపై భరోసా...
ముఖ్య నేతలు పోటీ చేసే చోట్ల ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లేందుకు కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసుకుంటోంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా గెలవాలనుకుంటున్న 40 స్థానాలతోపాటు దాదాపు 20 మంది ముఖ్య నేతలున్న స్థానాలు, తెలుగుదేశం, ఇతర పార్టీలతో కుదుర్చుకునే పొత్తుల్లోని కీలక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్రచారాస్త్రాలను సిద్ధం చేస్తున్నామని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటే వ్యూహంతో ముందుకెళ్తున్నామని టీపీసీసీ ముఖ్యుడు ఒకరు తెలిపారు.

మంత్రుల సీట్లపైనా నజర్‌...
రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం సహా 18 మంది ఉండగా వారిలో ముగ్గురు కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిని మినహాయిస్తే మిగిలిన 14 మందిలో హరీశ్‌రావు, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు లాంటి వారిని ఓడించడం అంత సులువు కాదనే భావన ఉన్నా మిగిలిన మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలపైనా కాంగ్రెస్‌ కన్నేసింది. 8 మంది మంత్రులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అంచనాతో వారిపై బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి ఆయా మంత్రుల నియోజకవర్గాల్లోనూ అనూహ్య ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.

‘రిజర్వుడ్‌’పై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలోని 31 రిజర్వుడు నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానాల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలను సిద్ధం చేసేందుకు ఎల్‌డీఎంఆర్‌సీ పేరుతో పనిచేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీలను 90 శాతానికిపైగా పూర్తి చేసింది.

బూత్‌లవారీగా ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను సమీక్షించుకోవడంతోపాటు మండల, నియోజకవర్గ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలా వరకు లైన్‌క్లియర్‌ చేసుకుంది. రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు, శక్తి యాప్‌ కింద కార్యకర్తల నమోదు, చామ్స్‌ పేరుతో క్షేత్రస్థాయి నేతలతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్‌లతో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.  

మరిన్ని వార్తలు