జనాభా ఆధారంగా బీసీలకు సీట్లు

22 Apr, 2019 02:23 IST|Sakshi
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ రిజర్వేషన్లపై జరిగిన అఖిలపక్ష సదస్సులో జాజుల, ఉత్తమ్, పొన్నాల, దత్తాత్రేయ, జస్టిస్‌ ఈశ్వరయ్య తదితరులు

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

రిజర్వేషన్లు తగ్గించడం సబబు కాదు: జస్టిస్‌ ఈశ్వరయ్య

ఎన్నికలు వాయిదా వేయాలి: దత్తాత్రేయ

బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై అఖిలపక్ష సదస్సు

హైదరాబాద్‌: సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ఆధారంగా బీసీలకు సీట్లు కేటాయిస్తామని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గత స్థానిక సంస్థల్లో కూడా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఉన్నప్పటికీ రిట్‌ పిటిషన్‌ వేసి బీసీలకు 34% రిజర్వేషన్‌లు కేటాయించామని గుర్తుచేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజి గూడ ప్రెస్‌క్లబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్, అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, బీసీ కులాల జేఏసీ చైర్మన్‌ గణేష్‌ చారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ ఎంబీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌ జిల్లాల వారీగా పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ, ప్రస్తుత పాలకుల అడ్డగోలు విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని, సుప్రీం గైడ్‌లైన్స్‌ను బూచిగా చూపిస్తూ చాలా జిల్లాల్లో ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. బీసీలు తప్పకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ 1994 ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నప్పటికీ, మనకు సంబంధంలేని 50 శాతం రిజర్వేషన్లు చూపిస్తూ బీసీ రిజర్వేషన్లు తగ్గించడం సబబుకాదన్నారు.

రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి జనరల్‌ కోటాలో ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కువ జనాభా ఉన్నారో వారినే అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో, విద్య, ఉద్యోగాల్లో, ఎంబీబీఎస్‌ సీట్లల్లో కూడా బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌ అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్‌ను కలవనున్నట్లు తెలిపారు. ఆదరబాదరాగా ఎన్నికలు నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని రిజర్వేషన్ల అంశం తేలేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతారన్నారు.

కేసీఆర్‌ బీసీ ద్రోహిగా మిగిలిపోతారు: జాజుల
జాజుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 5,843 ఎంపీటీసీలు ఉన్నారని, గతంలో 34 శాతం బీసీలకు కేటాయించగా 1,987 ఎంపీటీసీలు ఉండేవని, ప్రస్తుతం 1,011 మాత్రమే కేటాయించారన్నారు. దీంతో 972 ఎంపీటీసీలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 534 ఎంపీపీలు ఉండగా గతంలో 34 శాతం రిజర్వేషన్‌ ఉన్నప్పుడు 182 ఉండగా, ప్రస్తుతం 94 మాత్రమే కేటాయించారని, ఇక జెడ్‌పీటీసీలు 535 ఉండగా గతంలో 182 స్థానాలు బీసీలకు ఉండేవని, ప్రస్తుతం దాన్ని 17 శాతానికి కుదించారన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌లు మొత్తం 32 ఉండగా గతంలో 34 శాతం రిజర్వేషన్‌తో 11 మంది ఉండేవారని, ప్రస్తుతం 19 శాతానికి కుదించి 6 జెడ్‌పీ చైర్మన్లకు మాత్రమే అవకాశం ఇచ్చారని, దీంతో 5 సీట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని జాజుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎ.ఎల్‌.మల్లయ్య, బహుజన్‌ ముక్తి పార్టీ మహబూబ్‌నగర్‌ జిల్లా అభ్యర్థి వి.దాస్‌రాం నాయక్, గోపాల్‌తోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు