ఆ నాలుగు స్థానాలపై కోర్టుకు..

1 Jan, 2019 02:31 IST|Sakshi

ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలపై న్యాయపోరాటం 

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాల్సిందే 

బీసీ రిజర్వేషన్లపైనా పోరాటం.. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలో కాంగ్రెస్‌ నిర్ణయం 

పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల వ్యూహంపై చర్చ 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో ఉత్తమ్, కుంతియా ప్రత్యేక భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ విషయమై ఎన్నికల అధికారులను కోరినా పట్టించుకోలేదని, దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. పోలైన ఓట్లకు, కౌంటింగ్‌ జరిగిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్న స్థానాల్లో కూడా వివరాలు సేకరించి ఆ నియోజకవర్గాల విషయంలో కూడా కోర్టును ఆశ్రయించేందుకు పార్టీ నేతల నుంచి వివరాలు కోరింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు.

సమావేశానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సలీమ్‌ అహ్మద్, టీపీసీసీ ముఖ్య నేతలు షబ్బీర్‌అలీ, సంపత్, పద్మావతిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, దామోదర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, అజారుద్దీన్, మధుయాష్కీగౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, బలరాంనాయక్‌ హాజరయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నేతలు సమీక్షించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో పాటు, కౌంటింగ్, పోలింగ్‌ ఓట్లు సరిపోలకపోవడం, రైతుబంధు చెక్కులను ఎన్నికల సమయంలోనే జమ చేయడం, పంటలు సాగు చేయకపోయినా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ నగదు రూపంలో జమ చేయడం లాంటి కారణాలతో ఓటమి పాలైనట్లు అభిప్రాయపడ్డారు. కొందరు కలెక్టర్లు తమ అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కనీసం పనిచేయని ఈవీఎంల సమాచారం కూడా ఇవ్వలేదని, వీటన్నింటిపై సమగ్ర ఆధారాలను తీసుకుని కోర్టుకు వెళ్లాలని నేతలు నిర్ణయించారు. 

గెలిచిన నేతలతో ప్రత్యేక భేటీ 
గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి (మునుగోడు). హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), శ్రీధర్‌బాబు (మంథని), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), పైలట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు)లతో పాటు మాజీ ఎంపీ విజయశాంతి హాజరయ్యారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో రాజీపడకుండా అసెంబ్లీలో ప్రభుత్వంపై కొట్లాడాలని నిర్ణయించారు.

వచ్చే ఎన్నికల్లో వ్యూహంపై చర్చ.. 
‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా పార్టీ నిర్మాణం ఎలా ఉండాలన్న దానిపై సమావేశం జరిగింది. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం’
– మాజీ మంత్రి జానారెడ్డి 

ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన  
‘నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య విధానాల మీద పాలన నడవాలి. మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలన నడుస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరగాలని కోరుకుంటున్నా.’
– పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి 

ఓట్లు తొలగించారు..
‘సీనియర్‌ నేతలతో సమావేశం జరిగింది. ఈవీఎంల్లో తప్పులు జరగడం వల్లే టీఆర్‌ ఎస్‌ గెలిచింది. కాంగ్రెస్‌ బలం గా ఉన్న దగ్గర ఓట్లు తొలగించారు.  రీకౌంటింగ్‌ అడిగిన చోట్ల కూడా ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు అన్ని రాష్ట్రాల నేతలను కలుస్తాం.  
 – ఆర్‌.సి.కుంతియా 

న్యాయపోరాటం చేస్తాం.. 
‘తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిగింది. ధర్మపురి, తుం గతుర్తి, కోదాడ, ఇబ్రహీం పట్నంల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ న్యాయపోరాటం చేస్తాం. తమ ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తీసుకుంటారు. పంచాయతీ ల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం’  
  – ఉత్తమ్‌ 

వారిదే బాధ్యత 
త్వరలో జరగనున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్‌ నేతలు చర్చించారు. పార్టీ గెలిచిన స్థానాల్లోని పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను ఎమ్మెల్యేలే తీసుకోవాలని సూచించారు. ఓటమి పాలైన చోట్ల నేరుగా పీసీసీ పర్యవేక్షించడంతో పాటు పోటీచేసిన అభ్యర్థులు, సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు చొరవ తీసు కుని వీలున్నన్ని పంచాయతీ స్థానాలు గెలుచుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోటీకి సిద్ధం కావాలని, ఇప్పటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమీక్షలు, పార్టీ సమావేశాలు నిర్వహించాలని, లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఓడిపోయినా అందరం కలిసికట్టుగా ఉండాలని, ప్రజావ్యతిరేక విధానాలపై అధికార పార్టీతో తలపడాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు