రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ 

22 Dec, 2018 02:16 IST|Sakshi
మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ

అధికారపక్షం తీరుపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ధ్వజం

ఈ నెల 20న సీఎల్పీ భేటీ జరగలేదని స్పష్టం

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలపై రెండేళ్లుగా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న 

రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే యోచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారపక్షం తీరుతో ప్రజాస్వామ్యం పూర్తిస్థాయిలో ఖూనీ అవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. శాసనమండలిలో కాంగ్రె స్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో కలుపుతున్నట్టు పార్టీ మారిన నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు లేఖ ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లు మండలి కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని శుక్రవారం అనూహ్యంగా మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు లేఖ అందజేసిన నేపథ్యంలో ఉత్తమ్, షబ్బీర్‌లు స్వామిగౌడ్‌ను కలిశారు. పార్టీ మారిన కాంగ్రెస్‌ సభ్యులు చేసిన ప్రతిపాదనను ఆమోదించవద్దని స్వయంగా చేతిరాతతో కూడిన లేఖను అందజేశారు. 

రాష్ట్ర శాఖలకు విలీన అధికారం లేదు...
‘నలుగురు సభ్యులు టీఆర్‌ఎస్‌ఎల్‌పీలో కాంగ్రెస్‌ పార్టీని విలీనం చేయాలని లేఖ ఇచ్చారు. నిజానికి ఈ నెల 20న ఎలాంటి సీఎల్పీ సమావేశం జరగలేదు. వారిచ్చిన లేఖను తిరస్కరించాలి. ఎంఎస్‌ ప్రభాకర్‌పై రెండేళ్ల నుంచి, దామోదర్‌రెడ్డిపై ఏడాది నుంచి అనర్హత పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీలు విలీనం చేయాలని పిటిషన్‌ పెట్టారు. ‘తెలం గాణలో ప్రజా స్వామ్యాన్ని రక్షించాలని మేం కోరుతున్నాం. వారిచ్చిన లేఖను తిరస్కరించాలని విన్నవిస్తున్నాం. దీంతోపాటే ఆ నలుగురు ఎమ్మెల్సీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం’ అని లేఖలో ఉత్తమ్, షబ్బీర్‌ పేర్కొన్నారు. దీంతోపాటు సమర్పించిన మరోలేఖలో భారత రాజ్యాంగం, గతంలో వచ్చిన కోర్టు తీర్పుల గురించి ప్రస్తావించారు. ‘స్పీకర్‌ పార్టీలను విలీనం చేయకూడదని భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. ఇత ర పార్టీలో విలీనం చేసే అధికారాలు భారత జాతీయ కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం రాష్ట్ర పార్టీ శాఖలకు లేవు. ఒక జాతీయ పార్టీ ఎప్పటికీ ప్రాంతీయ పార్టీ లో విలీనం కాలేదు. విలీన వినతిని తోసిపుచ్చాల్సిం దే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ పేరా 4 ప్రకారం స్పీకర్‌ స్వతంత్రంగా వ్యవహరించకూడదు. మిగిలి న పేరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. మండలి చైర్మన్‌ను కలిసిన అనంతరం ఉత్తమ్, షబ్బీర్‌ మీడియాతో మాట్లాడారు. 

జాతీయస్థాయికి తీసుకెళతాం: షబ్బీర్‌ అలీ
పార్టీ మారిన సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ తామిచ్చిన లేఖలపై నిర్ణయం చేయకుండా, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ కోరగానే చైర్మన్‌ వెంటనే స్పందించారని షబ్బీర్‌ అలీ అన్నారు. పార్టీ ఫిరాయించినవారు చేసిన తీర్మానానికి ఎలా విలువ ఉంటుందని ప్రశ్నిం చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్‌ రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. సరిగా స్పందించకపోతే ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్తామన్నారు. మరో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఇదొక విచిత్రమైన పరిస్థితి అని, విలీన అంశం నైతికమా? అనైతికమా? అనే దానిని నాయకులే చెప్పాలన్నారు.

ఆ లేఖ వెనుక ఎవరున్నారో గమనించాలి: ఉత్తమ్‌ 
శాసనమండలిలోని కాంగ్రెస్‌ఎల్పీని టీఆర్‌ఎస్‌లో కలుపుతున్నట్టు పార్టీ మారిన నలుగురు సభ్యులు లేఖ ఇవ్వడం తెలంగాణ సమాజానికి ఆశ్చర్యం కలిగిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎలాంటి సీఎల్పీ భేటీ కాకుండా, అసలు కాంగ్రెస్‌లో లేనివాళ్లు విలీనలేఖను ఎలా ఇస్తారని ప్రశ్నిం చారు. నలుగురు ఎమ్మెల్సీలు సమర్పించిన లేఖ వెనుక ఎవరున్నారో తెలం గాణ సమాజం గమనించాలన్నారు. ఆకుల లలిత, సంతోష్‌కు సీఎల్పీ మీటింగ్‌ పెట్టే అధికారం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం ఖూనీ అవుతోందని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. చైర్మన్‌ న్యాయబద్ధంగా వ్యవహరించి మండలి ప్రతిష్టను కాపాడాలని కోరారు. 

రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం..
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం తమను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, ప్రభాకర్, దామోదర్‌రెడ్డిల వినతికి మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సానుకూలంగా స్పందించి వారిని టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తూ బులిటెన్‌ జారీ చేసిన అంశంపై కాంగ్రెస్‌ గుర్రుగా ఉంది. హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలసి ఈ అంశంపై ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఖూనీ అవుతోందో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలనే భావనలో ఉంది. దీనిపై శనివారం పార్టీ సీనియర్‌ నేతలు ప్రత్యేకంగా భేటీయై చర్చిస్తారని, అనం తరం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు