కేసీఆర్‌ను మీరే భూస్థాపితం చేయాలి

19 Sep, 2018 02:14 IST|Sakshi

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉత్తమ్‌ పిలుపు

ఉద్యమ రాళ్లుగా వాడుకుని మోసం చేశారు

కేసీఆర్‌పై ఆరోపణలతో టీపీసీసీ చీఫ్‌ బహిరంగ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది, విద్యార్థులను దారుణంగా మోసం చేసిన కేసీఆర్‌ను భూస్థాపితం చేసే బాధ్యత ఆయా వర్గాలే తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను రేయిం బవళ్లు ఉపయోగించుకుని, ఉద్యమ రాళ్లుగా వాడుకుని, ఆ పునాదిరాళ్లపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారిని కాళ్ల కింది చెప్పులా భావించి కిరాతకంగా వ్యవహరించారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు.

కాళ్లకు బలపం కట్టుకుని ఉద్యోగాలు, కుటుంబాలను లెక్కచేయకుండా రేయనక, పగలనక, నిరవధిక సమ్మెలు, మెరుపు ధర్నాలు, సకల జనుల సమ్మెలతో జీవితాలను త్యాగం చేస్తూ కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తే వారికి మిగిలిందేంటని ప్రశ్నించారు. ఆయా వర్గాలను ఉద్దేశిస్తూ కేసీఆర్‌పై 24 ఆరోపణలతో మంగళవారం ఉత్తమ్‌ బహిరంగ లేఖను విడుదల చేశారు. జూన్‌ 2న ఐఆర్‌ ఇస్తానని, ఆగస్టు 15న పీఆర్సీ ప్రకటిస్తానని టీవీ చానళ్లలో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన కేసీఆర్‌.. అతికిరాతకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను మోసం చేసి ఎన్నికలకు వెళ్లాడని లేఖలో ఆరోపించారు.

వారి ఆశలను అడియాసలు చేసి వంచించిన కేసీఆర్, టీఆర్‌ఎస్‌లను భూస్థాపితం చేసే బాధ్యత ఆయా వర్గాలపైనే ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పింఛన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేసి పాత పింఛన్‌ పథకాన్ని అమలు చేస్తామని.. 1.25 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను ఆదుకుంటామని.. అద్భుతమైన పీఆర్సీ, ఇళ్ల స్థలాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఆయా వర్గాలకు స్వర్ణయుగం తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఉత్తమ్‌ రాసిన లేఖ ముఖ్యాంశాలివి..
నాలుగేళ్లుగా ఉద్యోగులను మనుషులుగా, ప్రభుత్వ భాగస్వాములుగా గుర్తించ లేదు. రకరకాల పథకాలు పెట్టి రేయింబవళ్లు వారి సేవలను ఉపయోగించుకుని అవన్నీ కేసీఆర్‌ ఒక్కడి ఘనతే అన్నట్లు డబ్బా కొట్టుకున్నారు.
    ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటూ ఒక్కసారి కూడా కరువు భత్యం (డీఏ) సమయానికి ఇవ్వకుండా దారుణంగా హింసించారు. జిల్లాల విభజన చేసి ఉద్యోగులను, వారి కుటుంబాలను వేరు చేసి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదు.
    తెలంగాణ వస్తే ప్రతి ఉద్యోగికి పదోన్నతి ఇస్తానని చెప్పి 0.1 శాతం కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా వంచించారు. పెన్షనర్లు అడిగిన ఒకటి, రెండు ప్రయోజనాలు కూడా ఇవ్వకుండా.. ఎన్ని సార్లు అడిగినా కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అవమానించారు.
    వేతనాల్లో అసమానతల సవరణకు అనామలీస్‌ కమిటీ వేయకుండా కాలయాపన చేసి దొంగచాటుగా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ప్రగతిభవన్‌లో చర్చలు అని పిలిచి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలను దాదాపు 9 గంటల పాటు  గేటు ముందు నిలబెట్టి అవమానించారు.
 ఎన్జీవో నాయకుల్లో ఇద్దరు, గెజిట్‌ ఉద్యోగుల్లో ఒకరు, ముగ్గురు ఉపాధ్యాయ నేతలను కొని వారికి రాజకీయ పదవులిచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఘోరంగా మోసం చేశారు.
 నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోగా గతంలో వైఎస్సార్‌ ఇచ్చిన స్థలాలనూ రిజిస్ట్రేషన్‌ చేయకుండా అన్యాయానికి గురిచేశారు.
   లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, దినసరి వేతన సిబ్బందిని క్రమబద్ధీకరిస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చి కోతి కోర్టుకు పోయింది.. పిల్లి అడ్డం వచ్చిందంటూ అబద్ధాల మీద అబద్ధాలాడి మోసం చేశారు.
    అన్ని ప్రభుత్వ శాఖల్లో, పాఠశాలల్లో ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా అదిగో ఉద్యోగం, ఇదిగో ఉద్యోగం అంటూ విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేశారు.
   ఉద్యమ సమయంలో వర్సిటీలకు వెళ్లి ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని చెప్పి రెచ్చగొట్టి వారిని ఉపయోగించుకున్నాక ఇప్పుడు ఏ వర్సిటీలోనూ అడుగుపెట్టలేని పరిస్థితికి వచ్చారు.

మరిన్ని వార్తలు