మేమొస్తే జర్నలిస్టులకు కాలనీలు

29 May, 2018 01:41 IST|Sakshi
సోమవారం హైదరాబాద్‌లో జరిగిన జర్నలిస్టుల గర్జన సభకు హాజరైన పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నేతలు

     రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ కట్టిస్తాం 

     ‘జర్నలిస్టుల గర్జన’సభలో ఉత్తమ్‌ 

     వారి పిల్లలకు ఉచిత ప్రైవేట్‌ విద్య 

     అందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వలేదేం? 

     డబుల్‌ బెడ్రూం హామీలేమయ్యాయి? 

     ప్రభుత్వంపై ధ్వజమెత్తిన పీసీసీ చీఫ్‌ 

     వారి సమస్యల పరిష్కారానికి పోరాడతాం: గట్టు 

     మీరు గర్జిస్తే సర్కారు దిగొస్తుంది: కోదండరాం 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జర్నలిస్టుల కోసం తెలంగాణలోని 31 జిల్లాల్లోనూ జర్నలిస్టు కాలనీలు కట్టిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో జరిగిన ‘జర్నలిస్టుల గర్జన’లో ఆయన ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అనుకూల పత్రికలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలిస్తూ వ్యతిరేక వార్తలు రాసేవాటిపై కక్షపూరిత వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. ‘‘అక్రెడిటేషన్లను అందరు జర్నలిస్టులకు ఇవ్వలేదేం? వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లిస్తామని వరంగల్‌ వేదికగా ఇచ్చిన హామీ ఏమైంది?’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘‘మేం అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్‌ కార్డులిస్తాం. రూ.5 లక్షలకు ఆరోగ్య బీమా చేయిస్తాం. వారి పెన్షన్‌ను రూ.5,000కు పెంచుతాం. జర్నలిస్టులందరి పిల్లలకు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉచిత విద్య అందిస్తాం. వీటన్నింటినీ మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తాం’’అని హామీ ఇచ్చారు. 

ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులివ్వాలి: కోదండరాం 
జర్నలిస్టులందరూ గర్జిస్తే ప్రభుత్వం దిగిరాక తప్పదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అక్రెడిటేషన్లతో నిమిత్తం లేకుండా అందరికీ హెల్త్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై వారిని పిలిచి మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదంటూ ఆక్షేపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం హైదరాబాద్‌లో 60 ఎకరాలు కేటాయిస్తే ప్రభుత్వం కోర్టును సాకుగా చూపి అడ్డుకుంటోందన్నారు. జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్లు, హెల్త్‌ కార్డులు ఇవ్వకుంటే వారితో కలసి ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. జర్నలిస్టుల పోరాటానికి బీజేపీ మద్దతుంటుందని బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి చెప్పారు. పత్రికలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఐజేయూ జనరల్‌ సెక్రెటరీ  అమర్‌ అన్నారు. 

సమస్యలను పరిష్కరించాలి 
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ డిమాండ్‌ చేశారు. సీఎంను కలుద్దామంటే అవకాశమివ్వడం లేదన్నారు. ‘‘ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నాం. హెల్త్‌ కార్డులు చెల్లని కార్డులయ్యాయి. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలిస్తామని చెప్పి, ఇప్పుడు కోర్టు కేసు బూచిగా చూపుతున్నారు’’అని ఆక్షేపించారు. 

రాష్ట్ర సమస్యే కాదు ఐజేయూ అధ్యక్షుడు సిన్హా 
జర్నలిస్టులు ఇంత భారీగా తరలివచ్చారంటే సమస్య తీవ్రత అర్థమవుతోందని ఐజేయూ అధ్యక్షుడు సిన్హా అన్నారు. దీన్ని రాష్ట్ర సమస్యగా భావించలేమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జర్నలిస్టుల సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. 239 జీవోతో మీడియాకు నష్టం జరుగుతోందని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ అన్నారు. సర్కారుకు కొమ్ముకాసే యూనియన్ల తప్పుడు ప్రచారాలకు జర్నలిస్టులు మోసపోతున్నారని టీయూడబ్ల్యూజే సలహాదారు శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రెడిటేషన్‌తో నిమిత్తం లేకుండా హెల్త్‌ కార్డులు, మరణించిన వారి కుటుంబాలకు ఇస్తున్న రూ.లక్షను రూ.3 లక్షలకు పెంచడం సహా పలు తీర్మానాలను ఆమోదించారు.  

మరిన్ని వార్తలు