కేసీఆర్‌కు గోరీ కడతాం

18 Sep, 2018 03:04 IST|Sakshi
గాంధీ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న ఉత్తమ్‌

టీఆర్‌ఎస్‌ను బొంద పెడతాం 

తెలంగాణ విమోచన సభలో ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో నిజాం నియంత పాలన సాగుతోందని.. అణచివేత, నిర్బంధాలతోనే పాలిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల నేతలను అరెస్టు చేయడం, నిర్బంధించడం లాంటి దుర్మార్గ పాలన రాష్ట్రంలో సాగుతోందని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ పాలన నుంచి రాష్ట్రానికి విమోచన కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నియంత పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు గోరీ కడతామని, టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఉత్తమ్‌ ఎగురవేశారు.

అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్‌ రాష్ట్రానికి విముక్తి కలిగించిన సెప్టెంబర్‌ 17నే ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారన్నారు. నిజాం పాలన మాదిరిగానే తెలంగాణలో కేసీఆర్‌ పాలన సాగుతోందని, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ధర్నా చౌక్‌ లేకుండా చేశారని, ప్రశ్నించిన వారిని అరెస్టులు చేసి పగ తీర్చుకుంటున్నారని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్‌లిద్దరూ కలసి నాటకాలాడుతూ ముందస్తు ఎన్నికలకు పోతున్నారని, మోదీ–కేసీఆర్‌లలో ఎవరికి ఓటేసినా ఒకటేనన్నారు. 

ఇవేం అక్రమాలు..?
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని, కానీ దాదాపు 30 లక్షల ఓట్లను తొలగించి అక్రమంగా ఎన్నికలకు పోదామని చూస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని కూడా ప్రభావితం చేసేలా ఒత్తిడి చేస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. 2014 ఎన్నికలప్పటి నుంచి ఇప్పటి వరకు ఓట్ల సంఖ్య పెరగాల్సి ఉండగా 30 లక్షల ఓట్లు తగ్గాయని, ఇవేం అక్రమాలని ప్రశ్నించారు. అక్రమంగా ఓట్లు తొలగించి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, గతంలో జరిగిన ఎన్నికల్లోనూ ఇలానే చేశారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరించిన తరువాతే ఎన్నికలకు పోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు తమకెందుకు ఓట్లు వేయరని కేసీఆర్, కేటీఆర్‌లు ప్రశ్నిస్తున్నారని.. ముందు ఎందుకు ఓట్లేయాలో చెప్పాలని నిలదీశారు. ఆత్మహత్యలు, మద్యం అమ్మకాలు, అవినీతి, అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉన్నందుకు ఓట్లేయాలా అని ప్రశ్నించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు భూములు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు వేయాలా అని ఎద్దేవా చేశారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్‌ నేతల అవినీతిని ఎండగట్టి అవినీతిపరులను జైల్లో పెడతామని హెచ్చరించారు. 

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం
టీఆర్‌ఎస్‌ పాలనలో ఆర్టీసీని అధ్వానంగా మార్చారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో సంస్థను విలీనం చేస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు. టీఎస్‌ ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత అబ్రహం సోమవారం ఉత్తమ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీలో 2011 నుంచి కొత్త నియామకాలు లేవని, తాము రాగానే అవసరానికి తగినట్లు నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు.

మరిన్ని వార్తలు