చీటింగ్‌ టీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి

4 Oct, 2018 01:22 IST|Sakshi
నాగేశ్వర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమి కొట్టాలి: ఉత్తమ్‌

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని జోస్యం

సాక్షి, హైదారాబాద్‌: తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తూ మాయమాటలతో మభ్య పెడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీని బొంద పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని, కేసీఆర్‌ ఇంటికి పోవాల్సిందేనని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గోరీ కట్టాల్సిందేనంటూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. కాంగ్రెస్‌ గెలుపును అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే డబ్బులు, మద్యం పంచుతున్నారని, ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరుగుతున్నాయన్న విషయం ప్రజలకు విడమరచి చెప్పాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుయుక్తులను తిప్పికొట్టాలని ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో మెదక్‌ జిల్లా దుబ్బాక, గజ్వేలు నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరారు. వారికి ఉత్తమ్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నాలుగున్నరేళ్ల పాటు మోసాలే..
నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారని ఉత్తమ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో 4,500 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదని ఆరోపించారు. కొద్దిరోజుల కింద తాను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లగా అక్కడి విద్యార్థుల్లో కేసీఆర్‌ను తిట్టని వారు లేరని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఏనాడూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఆపలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాటికి ఉన్న ఉద్యోగాల ఖాళీలను ఈ రోజు వరకు ప్రభుత్వం భర్తీ చేయలేదని విమర్శించారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా తెల్ల రేషన్‌ కార్డుదారులకు 9 రకాల వస్తువులు సహా సన్న బియ్యం ఇస్తామన్నారు.

నిరుద్యోగ భృతి, పెన్షన్‌ పెంచుతామన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. డబుల్‌ బెడ్రూం పథకాన్ని మార్చి సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల వరకు మంజూరు చేస్తామన్నారు. దళితులు, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. కేసీఆర్‌ సొంత నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున చేరికలే టీఆర్‌ఎస్‌ ఓటమికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే దుబ్బాకలో రామలింగారెడ్డి ఓటమి ఖాయమనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌ గెలుపునకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని, బూత్‌ స్థాయిపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీలో చేరిన నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాకలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించి బహుమతిగా ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కాడని ఆరోపించారు. కార్యక్రమంలో పీసీసీ నేత గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు