ప్రాజెక్టుల్లో అవినీతిపై కమిటీ

9 Sep, 2019 02:47 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కుంతియా. చిత్రంలో భట్టి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

2 నెలల్లో గవర్నర్‌తో పాటు కేంద్రానికి నివేదిక

విలేకరుల సమావేశంలో కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్క  

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు, అవినీతిపై అధ్యయనం చేసేందుకు గాను కాంగ్రెస్‌ పక్షాన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీ రెండు నెలల్లో నివేదికిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతి యా చెప్పారు. దీన్ని గవర్నర్‌తో పాటు కేంద్రానికి సమర్పించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగడతామని తెలిపారు.

గాంధీభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్, భట్టి, ఏఐసీసీ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ కోదండరెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను వెలికి తీస్తామన్నారు. యురేనియం తవ్వకాల అంశం గిరిజనులకు మాత్రమే పరిమితం కాలేదని, మానవాళితో పాటు జీవవైవిధ్యంపై కూడా ప్రభావం చూపుతుందని, ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ వీహెచ్‌ నేతృత్వంలోని మరో కమిటీ పనిచేస్తుందని తెలిపారు.  

15న సభ్యత్వ నమోదు ప్రారంభం.. 
రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసీసీ ఆదేశించిందని, ఈ నెల 15న మహబూబ్‌నగర్‌లో సభ్యత్వ నమోదు ప్రారంభి స్తామని ఉత్తమ్‌ చెప్పారు. పార్టీలో సభ్యులుగా చేరే వారికి బీమా సదుపాయం కల్పించే బాధ్యతలు భట్టితో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై ఉంచామన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలో పార్టీ శిక్షణా కార్యక్రమాలుంటాయని, కాంగ్రెస్‌ సిద్ధాంతాలను వాడవాడలా ప్రచారం చేసేందుకు 10 మంది నేతలను ఏఐసీసీ ఇచ్చే శిక్షణకు పంపుతామన్నారు.

ఈ నెల 9న కాంగ్రెస్‌ నేతలు అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 11న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలోని ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.

>
మరిన్ని వార్తలు