కేసీఆర్‌తో టచ్‌లో ఉత్తమ్‌.. ఎసరు పెడుతున్న టీ కాంగ్రెస్‌!

20 Jun, 2018 13:08 IST|Sakshi

ఢిల్లీలో ఉత్తమ్‌కు వ్యతిరేకంగా టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల మంత్రాంగం

తాజాగా రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేసిన నేతలు 

సాక్షి, న్యూఢిల్లీ ‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ పీసీసీ) చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్‌ నేతలు పావులు కదుతుపున్నారు. ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు భేటీ అయి.. ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. పార్టీకి చెందిన విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం రాహుల్‌-టీ కాంగ్రెస్‌ నేతల భేటీ ఇలా సాగింది.

‘ఉత్తంకుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నాయకులు ఎవర్నీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని సీనియర్‌ నేతలు రాహుల్‌కు నివేదించారు. ఉత్తమ్ వ్యవహార శైలిపై బాగా లేదని, ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగితే 2019 ఎన్నికల్లో పార్టీకి 15 సీట్లు కూడా దక్కవని సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌ను కాకుండా వేరే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిని చేస్తే.. పార్టీ బలోపేతానికి, 2019 ఎన్నికల్లో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తామని మాజీమంత్రి డీకే అరుణ రాహుల్‌కు హామీ ఇచ్చారు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ భేటీలో ఉత్తమ్‌పై పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ‘మై హోమ్స్‌’  రామేశ్వరరావు ద్వారా సీఎం కేసీఆర్‌తో ఉత్తమ్‌ సంప్రదింపులు జరుపుతున్నారని రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల విన్న అనంతరం ఈ అంశంపై లోతుగా చర్చించేందుకు మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారు. త్వరలో టీ-కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జిని నియమించే యోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.

జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకే వచ్చాం..!

న్యూఢిల్లీ : పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తాము అపాయింట్‌మెంట్ అడిగామని, అందుకోసమే ఆయన తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని టీ కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ తెలిపారు. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో భేటీ అయిన అనంతరం వారు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం రాహుల్‌తో సమావేశంలో చర్చించామని వారు తెలిపారు. ‘2019లో తెలంగాణలో పార్టీని అదికారంలోకి తీసుకువస్తామని రాహుల్ చెప్పాం. అందుకోసం పని‌చేస్తున్నామని వివరిచాం. 2019లో కేంద్రంలో లౌకికవాద పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’ అని నేతలు అన్నారు. తెలంగాణలో పార్టీ నాయకుల్లో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రెండు రోజుల క్రితం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కూడా రాహుల్‌గాంధీని కలిశారని, అందుకే ఆయన తమ వెంట రాలేదని తెలిపారు.

పార్టీ బలోపేతం కోసం కమిటీ వేసి ఆ కమిటీతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని రాహుల్‌ను కోరామని, 40 మంది సీనియర్ నేతల పేర్లతో ఒక నివేదిక కూడా ఇచ్చామని తెలిపారు. ఒక రోజు సమయం కేటాయించి ఒక్కొక్కరితో మాట్లాడాలని రాహుల్‌ను కోరినట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో గెలవడానికి సంబంధించి అంశాలపై రాష్ట్ర సీనియర్ నేతలతో చర్చించాలని, వారి నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. వారం రోజుల్లో రాహుల్ గాంధీ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తారని భావిస్తున్నామని, ముఖ్య నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పామని తెలిపారు.

మరిన్ని వార్తలు