దళిత ఆగ్రహం: యోగికి అనూహ్య అవార్డు!

9 Apr, 2018 09:39 IST|Sakshi

లక్నో: దళిత సంఘాల ఆందోళన, స్వపక్షానికి చెందిన దళిత ఎంపీలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో అటు బీజేపీ అధినాయకత్వం, ఇటు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చడం, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ వైఖరి ఉన్నట్టు కనబడటం, దళితులపై పోలీసుల ఆగడాలు మొదలైన విషయాల్లో బీజేపీ అధినాయకత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, ఈ సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నించిన తమను యూపీ సీఎం యోగి గౌరవించడం లేదని బీజేపీ దళిత ఎంపీలు నలుగురు ఇటీవల గొంతెత్తారు. ప్రధాని నరేంద్రమోదీకి లేఖాస్త్రాలు సంధించారు.

ఈ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగిని అనూహ్య అవార్డు వరించింది. ఆయనను ‘దళిత మిత్ర’ అవార్డుతో సత్కరించనున్నట్టు అంబేద్కర్‌ మహాసభ ప్రకటించింది. ఒక వ్యక్తి ‘దళిత మిత్ర’ అవార్డు ఇచ్చి సత్కరించడం ఇదే తొలిసారి అని యూపీకి చెందిన దళిత సంఘమైన అంబేద్కర్‌ మహాసభ అధ్యక్షుడు లాల్జీ నిర్మల్‌ తెలిపారు. ‘యోగి ఆదిత్యానాథ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పోలీసు స్టేషన్‌లో అంబేద్కర్‌ ఫొటో పెట్టాలని ఆయన ప్రభుత్వం మొదటిసారి ఆదేశించింది. విధాన సభలో దళితులు, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్‌ కల్పించారు. యోగికి దళితమిత్ర అవార్డు ఇవ్వాలన్న నిర్ణయంపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తమ సంస్థకు ఏ పార్టీ నుంచి నిధులు అందడం లేదని, రాజకీయ దురుద్దేశంతోనే తమపై విమర్శలు చేస్తున్నారని నిర్మల్‌ పేర్కొన్నారు. మరోవైపు అంబేద్కర్‌ జయంతిని ఉత్తరప్రదేశ్‌ అంతటా ఘనంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు