టీఆర్‌ఎస్‌ ఖాతాలో 99 మంది ఎమ్మెల్యేలు 

18 Mar, 2019 00:57 IST|Sakshi

గులాబీ గూటికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

కేసీఆర్‌తో భేటీ.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటన 

మంత్రిపదవి దక్కొచ్చంటున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు 

క్యూలో మరో ముగ్గురు.. రెండ్రోజుల్లో కేసీఆర్‌ సెంచరీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభలో టీఆర్‌ఎస్‌ బలం వందకు చేరువయింది. ఆదివారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలతో కలిపి ‘గులాబీ’ ఎమ్మెల్యేలు 99 మంది అయ్యారు. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన 88 మంది గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ గుర్తుపై గెలిచిన ఒక ఎమ్మెల్యే వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కులతో మొదలైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలసల సంఖ్య వనమాతో 8కి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం 99 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టయింది. మరో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా నేడో, రేపో తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ సెంచరీ పూర్తి కానుంది. 

ఫాంహౌజ్‌కు వనమా 
వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు శుక్రవారమే ప్రచారం జరిగింది. కానీ..  వనమా ధ్రువీకరించలేదు. ఉన్నట్టుండి ఆదివారం ఆయన ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు వెళ్లారు. అక్కడ సీఎంను కలిసిన అనంతరం తాను టీఆర్‌ఎస్‌లో త్వరలోనే చేరుతానని ప్రకటించారు. కాగా, వనమాకు మంత్రివర్గంలో బెర్తు లభించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా టీఆర్‌ఎస్‌లో జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు, మున్నూరు కాపు కులస్తులకు ప్రాతినిధ్యం లేదు. వనమాకు ఐదుసార్లు గెలిచిన సీనియర్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది. 

కేసీఆర్‌పై విశ్వాసంతోనే! : వనమా 
‘సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళిక బద్ధంగా, చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్నారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని పదిలక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. ఎంతోకాలంగా ఉన్న కొత్తగూడెం జిల్లా డిమాండ్‌ను కేసీఆర్‌ నెరవేర్చారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం, కొత్త రహదారుల నిర్మాణం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో చేసింది. కేసీఆర్‌ నాయకత్వాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో బలపరిచారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి రెండోసారి కూడా అధికారం అప్పగించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కొత్తగూడెం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి నాకు ముఖ్యం. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆయనపై విశ్వాసంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాను. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను, శ్రేయోభిలాషులను సంప్రదించాకే అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను’అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు