పద్మావతీ సమేత ‘వనమా’

12 May, 2019 06:54 IST|Sakshi
వనమా వెంకటేశ్వరరావు, భార్య పద్మావతి

‘పద్మావతి భార్యగా రావడం నా అదృష్టం. 53 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు. నా ఎదుగుదలకు ఆమే ప్రధాన కారణం. ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం.. ఈ క్రమంలో ఇంటి వ్యవహారాలతోపాటు కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకుంటుంది. ఆమె సహకారంతోనే వార్డు సభ్యుడి స్థాయి నుంచి ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ‘మా అమ్మ సేవాభావాన్ని ఇప్పటికీ నా భార్య కొనసాగిస్తోంది. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో మొత్తం మూడు సినిమాలు చూశాం. నా రాజకీయ జీవితంలో ఎక్కువగా ప్రజా క్షేత్రంలోనే గడిపాను. రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా నవ్వుతూ పలకరించి బాగోగులు చూసుకుంటుంది’ అంటూ ‘సాక్షి’తో జీవిత విశేషాలను పంచుకున్నారు.

సాక్షి, కొత్తగూడెం: మాది ఉమ్మడి కుటుంబం. నాన్న నాగభూషణం వ్యవసాయం చేసేవారు. నా భార్య పద్మావతిది కొంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన నా ఎదుగుదలకు పద్మావతే కారణం. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర మంత్రి వరకు పని చేశా. ఏ పదవిలో ఉన్నా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధిపైనే నా ధ్యాస, శ్వాస. నా జీవితం నిరంతరం ప్రజలతో మమేకమవడమే. కుటుంబ వ్యవహారాలన్నీ పద్మావతే చూసుకునేది. కార్యకర్తల బాగోగులు కూడా చూడడంతోపాటు ఎవరికి ఏ అవసరం వచ్చినా స్పందించేది. అందుకే మమ్మల్ని అందరూ ఆది దంపతులు అంటారు. పద్మావతి తండ్రి శ్రీమంతుల గోపాలరావు అప్పట్లో భద్రాచలం ఏరియాలో కాంగ్రెస్‌ నాయకుడిగా, భద్రాచలం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.
   
1960లో పద్మావతితో వివాహం అయింది. నాటి నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే చూశాం. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీ సీతారాముల కల్యాణం.. ఇంకో సినిమా పేరు గుర్తు లేదు. ఈ మూడూ హైదరాబాద్‌లోనే చూశాం. ఇంట్లో గడిపిన సమయం తక్కువ కావడంతో టీవీలో కూడా కలిసి సినిమాలు చూసింది పెద్దగా లేదు. ఉదయం పూజ అయిన తర్వాత ఇద్దరం కలిసి అల్పాహారం తీసుకుంటాం. రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చినప్పటికీ నా బాగోగులన్నీ ఆమే చూసేది. పెద్దగా గొడవ పడింది ఎప్పుడూ లేదు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ప్రత్యేక వంటలు చేసినప్పుడు మాత్రం అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురుచూసేది.

సమయం దొరికితే తిరుపతికి వెళ్లొస్తుంటాం.. 
మా ఇష్ట దైవం వేంకటేశ్వరస్వామి. రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నప్పటికీ తీరిక దొరికితే మాత్రం ఇంటిల్లిపాదీ కలిసి తిరుపతికి వెళ్లి దేవుడిని దర్శించుకుని వస్తుంటాం.  పాత పాల్వంచలో వేంకటేశ్వరస్వామి గుడి, హనుమాన్‌ ఆలయం, సాయిబాబా ఆలయం కట్టించాం. బొడ్రాయి పనులను దగ్గరుండి చేశాం. పాల్వంచలోని అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సహకరించాం. పెద్దమ్మ గుడి వద్ద వంటశాల నిర్మింపజేశాం. ఈ అన్ని కార్యక్రమాల్లో పద్మావతి కీలకపాత్ర పోషించింది. మా అమ్మ అన్నపూర్ణమ్మ తర్వాత మా ఉమ్మడి కుటుంబ బాధ్యతలను పద్మావతమ్మే పోషిస్తూ వస్తోంది.
 
ఎవరింట్లో పెళ్లయినా మంగళసూత్రం మాదే..  
అప్పట్లో మా అమ్మ అన్నపూర్ణమ్మ ఇంటికి ఎవరొచ్చినా భోజనం పెట్టి పంపించేది. ఈ ప్రాంతంలో ఎవరింట్లో పెళ్లి జరిగినా పసుపు, కుంకుమ, మంగళసూత్రం, మెట్టెలు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేసేది. ఇప్పుడు నా సతీమణి పద్మావతి సైతం అదే ఒరవడి కొనసాగిస్తోంది. నేను కాలేజీలో చదివే రోజుల్లోనే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పని చేశా. 1966లో పాత పాల్వంచ (ప్రస్తుత పాల్వంచతో కలిపి) పంచాయతీకి మొదటిసారి వార్డు సభ్యుడిగా, ఆ తర్వాత పార్టీ రహితంగా పాల్వంచ మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా.

ఆ సమయంలో నాన్నకు సహాయంగా ఉండేందుకు తమ్ముడు చిన్న వెంకటేశ్వరరావుతో కలిసి పొలం పనులకు కూడా వెళ్లేవాడిని. మేము వరి, వేరుశనగ, మిర్చి పంటలు పండించేవాళ్లం. మామిడి తోట కూడా వేశాం. నాన్నకు ఉత్తమ రైతుగా ఆ రోజుల్లో బంగారు పతకం వచ్చింది. నాకు అన్ని విషయాల్లో తమ్ముడు చిన్నవెంకటేశ్వరరావు సహాయపడేవాడు. మా ఇద్దరిని అందరూ రామలక్ష్మణులని పిలిచేవారు. పదేళ్ల క్రితం తమ్ముడు మృతిచెందాడు. అప్పటి నుంచి మేనల్లుళ్లు ముత్యాల వీరభద్రరావు, కొత్వాల సత్యనారాయణ, కొత్వాల శ్రీనివాసరావు, రమణమూర్తి, కుమారులు రాఘవేందర్‌రావు, రామకృష్ణ అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు