జీవించే హక్కును పాలకులు కాలరాస్తున్నారు

31 Jan, 2018 02:26 IST|Sakshi

విరసం నేత వరవరరావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మనిషి జీవించే హక్కును పాలకులు కాలరాస్తున్నారని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు అన్నారు. 70 ఏళ్ల కిందటి నిజాం నవాబు నియంతృత్వ ధోరణి నేడు కనిపిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో భావ ప్రకటన హక్కు కోసం, సోషల్‌ మీడియాపై ఆంక్షలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల భావ ప్రకటనాస్వేచ్ఛను హరించేందుకు ఐపీసీ 506, 507 చట్ట సవరణ తీసుకువస్తున్నారని విమర్శించారు.

పరుష వ్యాఖ్యలు చేస్తే రెండేళ్ల శిక్ష వేయాలనే చట్టాన్ని తీసుకురావడం సరైంది కాదన్నారు. ప్రజాతంత్ర భావాలను భరించే స్థితిలో ప్రభుత్వాలు లేవని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ అన్నారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది రఘునాథ్‌ మాట్లాడుతూ, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఇలాంటి సెక్షన్లను సవరణ చేయడానికి వీల్లేదన్నారు. ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్‌ సుధాకర్, మేధావుల ఫోరం అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, విద్యార్థి వేదిక అధ్యక్షుడు కోట శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు