చంద్రబాబు మాటలు నమ్మే ప్రసక్తే లేదు

27 Sep, 2018 04:00 IST|Sakshi
విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గం రంగరాయపురంలో కుండ తయారీ విధానాన్ని పరిశీలిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్రలో వివిధ వర్గాల ప్రజల స్పష్టీకరణ 

అందరి సమస్యలు ఓపికగా విన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా 

సంఘీభావం తెలిపిన సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ ఎన్నెన్నో చెప్పారు. వాళ్ల మాటలు నిజమని నమ్మి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఓట్లు వేశాం. చంద్రబాబు కూడా ఎన్నో హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఏమీ చేయలేదు. ఒక్క పనీ కావడం లేదు. లంచాలివ్వనిదే పనులు కావడం లేదు. ఇంక వాళ్లు ఎన్ని మాటలు చెప్పినా నమ్మే ప్రసక్తే లేదు. మా మద్దతు జగనన్నకే’ అంటూ మహిళలు, యువత స్పష్టీకరించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 271వ రోజు బుధవారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో ప్రజలు జననేతకు నీరాజనాలు పలికారు. అడుగడుగునా మహిళలు హారతి పట్టి స్వాగతించారు.

అభిమాన నాయకుడితో మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. మరికొందరు మహిళలు జననేతపై పాటలు పాడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ గ్రామంలోని చిన్న రహదారుల్లో జగన్‌ వెళుతున్నపుడు పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు మిద్దెలపై నుంచి చేతులూపుతూ అభివాదం చేశారు. యువతులైతే జగనన్నను చూశామన్న ఆనందంతో కేరింతలు కొట్టారు. తమ ముంగిట్లోకి జగన్‌ వచ్చినపుడు పెద్ద సంఖ్యలో మహిళలు ఎదురేగి ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహపడ్డారు. లక్కవరపుకోట, కాశపేట, కుర్మవరం, తలారి, కొట్యాడ గ్రామాల్లో యువతీ యువకులు జగన్‌ను చూడటానికి భారీగా రోడ్డుపైకి తరలి వచ్చారు. అభిమాన జనసందోహం నడుమ జగన్‌.. ప్రతి గ్రామాన్ని దాటడానికి గంట.. గంటన్నర పట్టింది. పలు చోట్ల అభిమానులను దాటుకుని పోలేక జననత కాసేపు అలానే నిలుచుండిపోవాల్సి వచ్చింది. వృద్ధులు సైతం ఓపిక కూడగట్టుకుని జగన్‌ను చూడాలని తరలి వచ్చారు. 

నాలుగున్నరేళ్లుగా సమస్యలే..: తమ కష్టాలు వినే నాయకుడు వచ్చారంటూ ఊరూరా జననేతకు ఘన స్వాగతం పలుకుతూనే.. అదే స్థాయిలో కష్టాలూ చెప్పుకున్నారు. హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు పడిపోయిన తాటిచెట్లకు పరిహారం ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి నిలుపుకోలేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ ఉద్యోగాలు దొరక్క ఇతర రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు జననేత దృష్టికి తెచ్చారు. తమ వృత్తికి ఆదరణ కరువైందని, బతుకు భారమైందని కుమ్మరులు గోడు వెళ్లబోసుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని పలువురు వృద్ధులు జగన్‌ ఎదుట వాపోయారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కాంట్రిబ్యూటరీ పింఛన్‌ (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేస్తానని జగన్‌ ప్రకటించడం పట్ల సీపీఎస్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ నేతలు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మూడేళ్లుగా ఈ విషయంలో పోరాటం చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఫీజు బకాయిలు ఉండటంతో నర్సింగ్‌ కోర్సులో ఉత్తీర్ణులైనప్పటికీ తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని కొందరు విద్యార్థినులు వివరించారు. అందరి కష్టాలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ వర్తించని కారణంగా తమ జబ్బులకు మంచి వైద్యం చేయించుకోలేక పోతున్నామని, వెయ్యి రూపాయల వ్యయం దాటితే ఉచితంగా వైద్యం చేయిస్తానని జగన్‌ హామీ ఇచ్చినందున, అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినందున ఆయనే ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకుంటున్నామని పలువురు స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఆయనతో కలిసి నడుస్తూ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ఈ సందర్భంగా వారన్నారు.

నాన్నగారి హయాంలో లంచం లేకుండా ఉద్యోగం వచ్చిందన్నా.. 
అన్నా.. మాది ఎస్‌ కోట. నిరుపేద కుటుంబం. నా భర్త, అత్తమామలు, తోడికోడళ్లు అంతా ఉన్నా ఏమీ ఆదాయం లేని పూట గడవని పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకటించిన నోటిఫికేషన్‌లో ఒక్క దరఖాస్తుతోనే ఏఎన్‌ఎం పోస్టు వచ్చింది. ఏ పైరవీలు, లంచాలు లేకుండా వచ్చిన ఉద్యోగంతో మా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం కలిగింది. ఇంట్లో దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మందులతో పాటు మా జీవనానికి నేడు ఎంతో ధీమా వచ్చింది. ఇదంతా వైఎస్‌ చలవే. మీరు ముఖ్యమంత్రి అయితే నాలాగే ఎందరివో బతుకులు బాగుపడతాయన్నా. నడుచుకుంటూ వస్తున్నారు. అలిసిపోయుంటారు. ఇదిగో ఈ ఓ ఆర్‌ఎస్‌ పాకెట్లు తాగండన్నా. 
– చదరం పార్వతిదేవి, ఏఎన్‌ఎం, ఎల్‌ కోట పీహెచ్‌సీ 

నవరత్నాలు ప్రతి ఇంటికీ చేరాలి 
జగనన్నను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. అన్న ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూశాము. 20 కిలోమీటర్ల నుంచి వచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ పనులూ అవ్వడం లేదు. మరుగుదొడ్డి కావాలన్నా.. ఇల్లు కావాలన్నా.. కార్పొరేషన్‌ రుణాలు కావాలన్నా.. రేషన్‌కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులకు లంచం ఇవ్వాల్సిందే. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి కుటుంబానికి నవరత్న పథకాలు చేరతాయి. ఒక కుటుంబం అనేక విధాలుగా ప్రయోజనం పొందుతుంది. అందుకే జగనన్న ముఖ్యమంత్రి కావడానికి అందరూ మద్దతివ్వాలి.  
– బీల రాజేశ్వరి, రాము, వావిలాపాడు 

మరిన్ని వార్తలు