వర్ల రామయ్య చాంబర్‌లో కుర్చీ 40 వేలు..

14 Jun, 2018 13:00 IST|Sakshi
ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య కోసం కేటాయించిన కారు

ఆర్భాటపు ప్రమాణ స్వీకారానికి భారీగా వ్యయం

చాంబర్‌లో రూ.40 వేలతో ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు

వర్ల ఇంటి సేవల కోసం ఉద్యోగుల కేటాయింపు

ఆర్టీసీ నిధులతో మూడు  కార్లు కొనుగోలు

అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి గుదిబండలా ఆర్భాటాలు

ఆయన ఓ సంస్థకు చైర్మన్‌. ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. అప్పటికే సంస్థ అప్పుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఎవరైనా సంస్థ ఆర్థికాభ్యున్నతికి చర్యలు తీసుకుంటారు. ఆయన మాత్రం అందుకు భిన్నంగా హంగు, ఆర్భాటం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారు. ప్రమాణ స్వీకారం పేరుతో ఆర్టీసీ నిధులు  భారీగానే  ఖర్చు చేశారు. ఇవి చాలవన్నట్లుగా తన చాంబర్‌ ఆధునికీకరణ, ప్రత్యేక కుర్చీ, విలాసవంతమైన కార్లు తదితరాల వాటి కోసం మరిన్ని నిధులు వ్యయం చేశారు. మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నట్లుగా చైర్మన్‌ వ్యవహారం ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆయన తీరును విమర్శిస్తున్నారు.

సాక్షి,అమరావతిబ్యూరో: గత అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీచేసి ఓటమి తరువాత తన రాజకీయ ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూసిన వర్ల రామయ్యకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్టీసీ చైర్మన్‌గా నామినేటెడ్‌ పదవిని కట్టబెట్టారు. ఆయనతో పాటు మరో నలుగురికి నాలుగు జోన్ల చైర్మన్లగా అవకాశం కల్పించారు. నాలుగేళ్ల పాటు అధికారుల పాలనలో ఆర్టీసీ ఆదాయం పెంచుకునేలా కృషిచేస్తున్న నేపథ్యంలో పాలకవర్గం పేరుతో ప్రభుత్వం ఆర్టీసీపై అదనపు భారం మోపింది. ఇప్పటికే దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులతో నెట్టుకువస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం కనీస చేయూత కూడా ఇవ్వలేదు. కొత్త బస్సుల కొనుగోలుకు చిల్లర వేస్తూ డీజిల్‌పై రాయితీ కూ డా ఇవ్వని దుస్థితిలో ఉంది. ఈ క్రమంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పాలకవర్గం తమ విలాసాల కోసం ఆర్టీసీ నిధులను నీళ్లలా ఖర్చు చేయడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విలాసాల కోసం..
ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం కోసం ఆర్భాటం చేశారు. సుమారు 2 వేల మందిని జనసమీకరణ చేయించి వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు. దాంతో పాటు తన చాంబర్‌ను ప్రత్యేకంగా ఆధునికీకరించారు. చాంబర్‌ ఆధునికీకరణ, ప్రమాణస్వీకారం కోసం, చైర్మన్‌ కూర్చునేందుకు ప్రత్యేక కుర్చీ తదితరాల కోసం రూ. కోటి వరకు ఖర్చు చేశారు. అలాగే వర్ల హోదా, డాబు కోసం తనతో పాటు తన కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.70 లక్షల విలువ చేసే రెండు ఖరీదైన గేర్‌లెస్‌ ఇన్నోవా, ఫార్చూనర్‌  కార్లు కొనుగోలు చేశారు. దాంతో పాటు ఎస్కార్ట్‌ కోసం మరో వాహనంకొనుగోలు చేశారు. కేవలం కార్ల కొనుగోలు కోసమే కోటి రూపాయలు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఇంటి పనులకోసం ఆర్టీసీ ఉద్యోగులు?
ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే తన సొంత అవసరాల కోసం ఆరుగురు ఉద్యోగులను ఉపయోగించు కుంటున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాబినెట్‌ ర్యాంకు హోదా ఉన్న చైర్మన్‌కు అధికారికంగా సీనియర్‌ స్కేల్‌ అధికారితో పాటు స్టెనో, ఇద్దరు అటెండర్లు, గన్‌మెన్‌తోపాటు నలుగురు సెక్యూరిటీ విభాగం, నలుగురు డ్రైవర్లు ఉంటారు. అనధికారికంగా మరో ఆరుగురిని ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

రాజకీయ నిరుద్యోగులకు ఉపాధిగా..
అప్పుల్లో ఉన్న ఆర్టీసీని మాత్రం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి వనరులుగా మార్చేసింది టీడీపీ ప్రభుత్వం. ఆర్టీసీకి ఆర్థిక భారంగా మారిన ఆర్టీసీ జోనల్‌ చైర్మన్ల వ్యవస్థను ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించింది. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం నలుగురు నేతలకు ఉపాధి కోసం తిరిగి జోనల్‌ చైర్మన్ల వ్యవస్థ పునద్ధరించింది. వారికి చాంబర్లు, ఆర్భాటపు ఖర్చుల కోసం మరో రూ.2 కోట్ల వరకు కేటాయించాల్సి వస్తోందని ఆర్టీసీ కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన నేతలు కూడా ఇంత ఆర్భాటపు ఖర్చులు చేయలేదని కార్మిక నేతలు చెబుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రస్తుత ఆర్భాటం కోసం ఖర్చు చేసిన నిధులతో నాలుగు తెలుగు వెలుగు, ఒక వోల్వా బస్సు కొనుగోలు చేయవచ్చని పలువురు కార్మికులు వ్యాఖ్యానిస్తున్నారు. చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి నెలన్నర కావస్తున్నా సంస్థ పురోభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా