బాలకృష్ణకు ఆడ కూతుళ్లు లేరా? : వాసిరెడ్డి పద్మ

4 Apr, 2019 14:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజకీయంగా వైఎస్‌ జగన్‌ను ఎదుర్కునే దమ్ము లేక మహిళ గురించి దుష్ప్రచారం చేస్తారా అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కుటుంబమే లక్ష్యంగా చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తారని ఇవాల్టి ఆయన మాటలతో తెలుసుకోవచ్చని అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వచ్చిన పోస్ట్‌ల్లో టీడీపీ హస్తం ఉందనే విషయం బయటపడుతోందన్నారు. గుంటూరులోని ఓ మంత్రి అనుచరుడు ఈ విధంగా చేశారని గుర్తించి అతన్ని అరెస్ట్‌చే శారని తెలిపారు. బాలకృష్ణ బిల్డింగ్‌లో టీఎఫ్‌సీ మీడియా చేస్తున్న అరాచకాలు కూడా బయటపడుతున్నాయని అన్నారు. దొంగ సర్వేలు చేస్తూ.. షర్మిలపై దుష్ప్రచారం చేయడం కూడా అందులో భాగమేనని తెలుస్తోందన్నారు. బాలకృష‍్ణకు ఆడకూతుళ్లు లేరా.. విజయమ్మ, షర్మిల ప్రచారంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎఫ్‌సీ మీడియా వేదికగా ఆంధ్రజ్యోతిలో దొంగ సర్వే ప్రచురించారని అన్నారు. ఇంటిలిజెన్స్‌ ఆఫీస్‌లకు తోడుగా.. ఇలా దొంగ సర్వేలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎక్కడ ఏం జరిగినా.. జగన్‌కు అంటగడుతున్నారని దుయ్యబట్టారు. అన్నా అనే పదానికి అర్థం తెలుసా చంద్రబాబు? అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని.. మహిళా అధికారిపై మీ ఎమ్మెల్యే దాడి చేయలేదా..? మహిళలు అంటే టీడీపీకి గౌరవం లేదని అన్నారు. కాల్‌మనీ కేసును నీరుగార్చారని అన్నారు. డ్వాక్రా, బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టారని ఇప్పుడేమో పసుపు-కుంకుమ అంటూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మనిషి పాల్పడని అన్యాయానికి పాల్పడుతుంటే.. మిమ్మల్ని మనుషులుగా గుర్తించాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాలకృష్ణ బిల్డింగ్‌లో ఉన్న టీఎఫ్‌సీ మీడియా డైరెక్టర్లు చంద్రబాబు అడ్డాలో ఉన్నారని అన్నారు. వాళ్లను, డేటాచోరీ అశోక్‌ను కాపాడుతున్నారని అన్నారు. ఏ మహిళకు న్యాయం చేశారని, చదువుకున్న అమ్మాయిలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చలేదని, సహచరుడు వైఎస్సార్‌ కూతురు ప్రచారం చేస్తుంటే.. ఆమె మీద విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ మహిళలకు వ్యతిరేక పార్టీ అని.. ఏ పార్టీ మీలా దిగజారలేదంటూ దుయ్యబట్టారు. ఓ స్థాయిలో ఉన్న మహిళలకు విలువ ఇవ్వని చంద్రబాబు సాధారణ మహిళలకు ఏం విలువ ఇస్తారని ప్రశ్నించారు. ఆడవాళ్లకు న్యాయం చేయని మృగం చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు. ఆడవాళ్ల మీద దుష్ప్రచారానికి సోషల్‌మీడియాని ఉసిగొల్పుతున్నాడంటే.. చంద్రబాబు ఎలాంటి వారో అర్థంచేసుకోవచ్చు.. మహిళలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. మహిళలు ఆలోచించి చంద్రబాబుకు బుద్దిచెప్పండని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు