రాణికి రాజ్‌పుత్‌ సవాల్‌!

25 Nov, 2018 05:00 IST|Sakshi
వసుంధరా రాజే, మానవేంద్ర సింగ్‌

     అభివృద్ధి, సంప్రదాయ ఓటుపై సీఎం ధీమా 

     రాజ్‌పుత్‌లను నమ్ముకున్న మానవేంద్ర

రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఝల్రాపాటన్‌. రాష్ట్ర రాజధాని జైపూర్‌కు 347 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న పట్టణంలో గుళ్లు గోపురాలు ఎక్కువ. అందుకే గుడి గంటలు అన్న అర్థంలో ఝల్రాపాటన్‌ పేరు వచ్చింది. వరుసగా మూడుసార్లు అక్కడినుంచి వసుంధరా రాజే సులభంగానే గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడి ఎన్నిక ఏకపక్షంగానే ఉంటుందని భావించిన నేపథ్యంలో.. చివరి నిమిషంలో కాంగ్రెస్‌ కత్తిలాంటి అభ్యర్థిని రంగంలోకి దించింది. మొన్నటివరకు బీజేపీ ముఖ్య నేతగా ఉండి.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మానవేంద్ర సింగ్‌ (బీజేపీ మాజీ నేత జస్వంత్‌ సింగ్‌ కుమారుడు)ను రాజేపై పోటీలో నిలబెట్టింది. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. 

మొన్నటివరకు రాజే, మానవేంద్ర సింగ్‌.. బీజేపీలోనే ఉన్నా.. ఒకరంటే ఒకరికి పడదు. అదే వైరం ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకునేవరకు వచ్చింది. ఒకప్పుడు సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఆ తర్వాత రాజకీయ వైరం ముదిరి.. వంశ ప్రతిష్ట, ఆత్మగౌరవం వంటి మాటలు తెరపైకి రావడంతో వ్యక్తిగత దూషణలు మొదలయ్యాయి. 2014కు ముందు వరకు వసుంధర రాజే, జస్వంత్‌ సింగ్‌ కుటుంబాల మధ్య సాన్నిహిత్యమే ఉండేది. అయితే.. గత సార్వత్రిక ఎన్నికల్లో జస్వంత్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రమైన రాజస్తాన్‌లో బర్మార్‌ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించడమే వీరి మధ్య వివాదాన్ని రాజేసింది. జస్వంత్‌ ఎక్కడ తన సీటుకు ఎసరు పెడతారోననే భయంతో ఆయనకు టికెట్‌ రాకుండా రాజే అడ్డుకున్నారు. తీవ్ర మనస్తాపంతో జస్వంత్‌ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బర్మార్‌ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. 4లక్షల ఓట్లను సాధించి ప్రజల్లో తనకున్న పట్టును చాటుకున్నారు. ఆ తర్వాత బాత్‌రూమ్‌లో పడిపోయి కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన కుమారుడు మానవేంద్ర సింగ్‌ను కూడా పార్టీలో పైకి రాకుండా రాజే అడ్డుకున్నారు. దీంతో నాలుగేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న మానవేంద్ర సెప్టెంబర్‌లో బర్మార్‌లో స్వాభిమాన్‌ ర్యాలీ నిర్వహించారు. రాజే హయాంలో రాజ్‌పుత్‌లకు జరుగుతున్న అవమానాలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాతే కాంగ్రెస్‌ గూటికి చేరారు.

సత్సంబంధాలపైనే రాజే విశ్వాసం 
ఝల్రాపాటన్‌ నియోజకవర్గంపై వసుంధర రాజేకు మంచి పట్టుంది. మూడు సార్లుగా ఆమె ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికవుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మీనాక్షీ చంద్రావత్‌పై ఏకంగా 60వేల ఓట్ల మెజార్టీని సాధించారు. తన నియోజకవర్గం విషయంలో మాత్రం ఆమె పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అక్కడి ప్రజలతో ఒకరకంగా కుటుంబ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధికి కూడా బాగా కృషి చేశారు. అద్భుతమైన రోడ్లు వచ్చాయి. విమానాశ్రయం ఏర్పాటైంది. కోటాలో 300పైగా సున్నపురాయి ఫ్యాక్టరీల్లో కార్మికుల మెరుగైన జీవన ప్రమాణాల కోసం చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలు. అయితే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో కొందరు వ్యాపారస్తుల్లో నెలకొన్న అసంతృప్తి, నియోజకవర్గంలో విస్తారంగా సంత్రాలు సాగు చేస్తున్న రైతులు నిండా అప్పుల్లో మునిగిపోవడం, ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల్ని శాసించే రాజ్‌పుత్‌లు సర్కార్‌పై కోపంగా ఉండడం వంటి అంశాలు రాజేకు ఇబ్బందిగా మారాయి. 

స్థానికుడు కాదు.. కానీ! 
మానవేంద్ర సింగ్‌ స్థానికుడు కాకపోవడం ఆయనకు ముళ్లబాటగానే మారొచ్చనే విశ్లేషణలు వినబడుతున్నాయి. బర్మార్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న షియో నియోజకవర్గానికి మానవేంద్ర సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చేశారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బర్మార్‌ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ రాజేపై యుద్ధానికి అధిష్టానం మానవేంద్ర సింగ్‌ను ఎంపిక చేయడంతో.. మొదట్లో ఆశ్చర్యపోయినా తర్వాత పోటీకి సిద్ధమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, రాజ్‌పుత్‌ల మద్దతుతోనే నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవ నినాదాన్ని బాగా జనంలోకి వెళ్లేలా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వసుంధరా రాజేకున్న అహంకారాన్ని, తాను ఎదర్కొన్న అవమానాల్నే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఈ పోరాటాన్ని రాజే వర్సెస్‌ జస్వంత్‌ సింగ్‌ మధ్య పోరాటంగా ఆయన చిత్రీకరిస్తున్నారు. సీఎంగా ఉన్న రాజేను ఆమె సొంత నియోజకవర్గంలో ఢీకొట్టడం అంతం సులభం కాదని మానవేంద్రకూ తెలుసు. 

ఇవీ కులం లెక్కలు 
ఈ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నాయి. ముస్లింలు అత్యధికంగా 50వేల మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో దళితులు (35 వేలు)న్నారు. ధకారాలు, రాజ్‌పుత్‌లు చెరో 20 వేల మంది వరకున్నారు. సోంధియా రాజ్‌పుత్‌లు 15వేలు, బ్రాహ్మణులు, వైశ్యులు 20 వేల మంది ఉంటే.. గుజ్జర్లు 12 వేలు, దాంగి , పటీదార్‌ సామాజిక వర్గాల ఓటర్లు 16 వేల వరకు ఉన్నారు. సంప్రదాయంగా ఇక్కడ బీజేపీకి ముస్లింలు, దళితులు అండగా ఉంటున్నారు. ఈసారి వారి ఓట్లనే రాజే నమ్ముకున్నారు. గతంలో రాజ్‌పుత్‌లు కూడా బీజేపీ వెంటే నడిచినప్పటికీ ఈసారి ఆ పరిస్థితి లేదు. 

మరిన్ని వార్తలు