సీఎం యాత్ర అంత ఖరీదా..!

22 Aug, 2018 16:21 IST|Sakshi
వసుంధర రాజే (ఫైల్‌ ఫోటో)

జైపూర్‌ : పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తు‍న్నారంటూ రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వసుంధర రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ్‌ యాత్రను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ నెల 4 నుంచి10 వరకు ఉదయ్‌పూర్‌ డివిజన్‌లోని 23 నియోజకవర్గాల్లో వసుంధర పర్యటించారు. ఈ యాత్రకు ప్రభుత్వం ప్రజల సొమ్మను దుర్వినియోగపరుస్తోందని, ఇప్పటి వరకు ఎంత మొత్తం ఖర్చు చేశారో తెలియాజేయాలని రాజస్తాన్‌ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషన్‌పై విచారించిన హైకోర్టు బెంచ్‌ దీనిపై అఫడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు రోజుల సీఎం యాత్రంలో కోటీ పదిలక్షల రూపాయాలను ఖర్చు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ లాల్‌ సైనీ హైకోర్టుకు తెలిపారు. యాత్రలో భాగంగా టెంట్‌కు 38.98 లక్షలు, బ్యానర్స్‌కు 25.99 లక్షలు చొప్పున ఖర్చు చేసినట్లు సైనీ వెల్లడించారు. సీఎం ఉపయోగించే పెన్‌డ్రైవ్‌ కోసం ఏకంగా 16వేలు, పాటల కోసం 3.50 లక్షలు ఖర్చు చేసినట్లు అఫడవిట్‌లో సైనీ తెలియజేశారు. వసుంధర ఖర్చు పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ప్రజల సొమ్మును పార్టీ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన సైనీ ఈ యాత్ర పార్టీ కార్యక్రమాల్లో ఓ భాగమని, దీని ఖర్చు మొత్తం పార్టీ యూనిట్‌ నేతలే చెల్లిస్తున్నారని తెలిపారు. కాగా వసుంధర తదుపరి యాత్ర ఈనెల 24 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు 165 నియోజకవర్గాల్లో 6000 కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.


మరిన్ని వార్తలు