కేసీఆర్‌ సర్కారును బర్తరఫ్‌ చేయాలి

24 Mar, 2019 01:11 IST|Sakshi

ఫిరాయింపులతో రాజ్యాంగ సంక్షోభం

సీఎం కార్యాలయం కేంద్రంగానే కుట్ర

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని, తమ పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్న ప్రభుత్వాన్ని వెంటనే భర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రే ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సిగ్గు చేటన్నా రు. శనివారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు కుంతి యా, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, జైపాల్‌రెడ్డి, జెట్టి కుసుమ కుమార్, గూడూ రు నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్‌లు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలిశారు.  కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యేలు సబి తా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, చిరుమర్తి లింగయ్య, బీరం హర్షవర్దన్‌రెడ్డి, బానోత్‌ హరిప్రియ, కందాల ఉపేందర్‌రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు ఫిరాయింపులపై స్పందిం చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజ్‌భవన్‌ ఎదుట మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌కు ఇదే చివరి హెచ్చరిక: మొయిలీ 
‘‘తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులన్నీ ఒకే విధంగా జరుగుతున్నాయి. ఈ తతంగమంతా సీఎం కార్యాలయం కేంద్రంగానే నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నామని విడుదల చేసిన లేఖలన్నీ ఒకే విధంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ ఇదే విషయమై పలుమార్లు మా పార్టీతోపాటు టీడీపీ స్పీకర్‌కు అనేక పిటిషన్లు ఇచ్చింది. కానీ ఫిరాయింపు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై ఎలాంటి వేటు పడలేదు. కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వలేదు. దీనికి కారణం సీఎం కేసీఆరే. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల తరువాత కూడా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం దారుణం. కేసీఆర్‌ రాజ్యంగ విలువల్ని, రాజధర్మాన్ని విస్మరించారు. ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించడానికి కేసీఆర్‌ అక్రమాలపై రాజ్యాంగాధినేతగా  చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరాం. సీఎం కేసీఆర్‌కు ఇదే మా చివరి హెచ్చరిక. గవర్నర్‌కు ఇదే చివరి వినతి’’అని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో 29% ఓటు బ్యాంకు, 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే ఫిరాయింపు లను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహించడం దారుణమని మరో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి విమర్శించారు. 

నేను నరసింహన్‌ను.. ఉత్సవ విగ్రహాన్ని కాదు : గూడూరుతో గవర్నర్‌ వ్యాఖ్యలు 
పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గవర్నర్‌ నరసింహన్‌ను కాంగ్రెస్‌ నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చిన సమ యంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంగ్రె స్‌ నేత గూడూరు నారాయణరెడ్డి తనను ఉత్సవ విగ్రహంగా గతంలో అభివర్ణించడాన్ని నరసింహన్‌ ప్రస్తావించారు. గవర్నర్‌ సిబ్బంది ఒకరు గూడూరు ను నరసింహన్‌కు పరిచయం చేయగా ‘‘నేను నరసింహన్‌ను, అంతటా ఉంటాను. ఉత్సవ విగ్రహాన్ని కాదు’’అని వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు